భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : చలి పంజా విసురుతున్నది. జనాల్ని గజగజ వణికిస్తున్నది. వాతావరణం మార్పు కారణంగా రోజురోజుకూ చలి తీవ్రత బాగా పెరిగిపోతున్నది. తెల్లవారుజాము నుంచే మంచు దుప్పటి కప్పేసి.. పగలంతా చలిగాలులతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. పగలు రాత్రులు తేడాలేకుండా గత రెండు వారాల నుంచి అదేస్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 నుంచి 12 డిగ్రీలకు మించకుండా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక చంటి పిల్లలు అయితే చలిగాలులకు తట్టుకోలేక జలుబులతో ఆసుపత్రి పాలవుతున్నారు. వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చలిమంట లేకుండా తట్టుకోలేకపోతున్నారు. దగ్గు, జలుబు జ్వరాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
రాత్రీపగలు తేడా లేకుండా రోజంతా చలి తీవ్రత అదే స్థాయిలో ఉండటంతో జనం బయటకు రాలేకపోతున్నారు. ఉదయం వాకింగ్ చేసే వాళ్లు కూడా చలి ప్రభావానికి ఇంటికే పరిమితమవుతున్నారు. చిరు వ్యాపారులు ఉదయం 11 గంటల వరకు ఇంటివద్దనే ఉంటున్నారు. కూరగాయల మార్కెట్కు సైతం జనం రాకపోవడంతో వ్యాపారులు చలికి తట్టుకోలేక ఇంటిముఖం పడుతున్నారు. పగలు, రాత్రులు అవే ఉష్ణోగ్రతలు ఉండటంతో పట్టపగలు నుంచి రాత్రి వరకు రగ్గులు, స్వెట్టర్లు వేసుకుని గడిపేస్తున్నారు. 10 నుంచి 12 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చల్లని నీరు తాగలేక వేడినీరు తాగినా జలుబు మాత్రం జనాన్ని వదలడం లేదు.
చలి తీవ్రత బాగా ఉంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి వాతావరణంలో పిల్లలను బయటకు పంపించడం మంచిది కాదు. వృద్ధులు కూడా బయటకు వెళ్లరాదు. తప్పనిసరిగా మాస్క్లు ధరించుకోవాలి. స్వెట్టర్లు వెచ్చని దుస్తులు వేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాచి చల్లార్చిన నీరు తాగాలి ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జలుబు చేస్తే చాలారోజుల వరకు తగ్గదు. మొబలైజర్ పెట్టే పరిస్థితి రాకుండా చూసుకోండి. ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. పరిస్థితి సీరియస్ అవుతుంది. వేడి వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి.