కొత్తగూడెం సింగరేణి, మే 15 : సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమానికి సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ఖర్చుకు వెనుకాడకుండా సింగరేణి ప్రధానాస్పత్రి సహా అన్ని ఏరియా దవాఖానలను ఆధునీకరించినట్లు సీఎండీ బలరాంనాయక్ తెలిపారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆస్పత్రిని సీఎండీ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర వార్డుతోపాటు అన్ని వార్డులు, ఉద్యోగులకు వైద్య సేవలు అందించే అన్ని విభాగాలు, ఫార్మసీని ఆయన పరిశీలించారు.
మందుల వివరాలను ఫార్మాసిస్టులను, వార్డుల్లోని రోగుల వివరాలను డాక్టర్లు, నర్సులను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు, వారి కుటంబ సభ్యులు ఆసుపత్రుల్లో త్వరితగతిన కోలుకునే విధంగా వైద్యపరంగా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. అంతర్గత మెడికల్ ఆఫీసర్స్ ఇటీవల స్టడీ లీవ్‌పై వెళ్లి స్పెషలిస్టు కోర్సు పూర్తి చేసుకొని వచ్చారని, ఇక అన్ని స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఆయన వెంట సీఎంవో కిరణ్‌రాజ్‌కుమార్, ఏసీఎంవోలు ఉష, సునీలా, సీనియర్ పీవో శ్రీనివాస్, స్పెషలిస్టు వైద్యులు ఉన్నారు.