మామిళ్లగూడెం, ఆగస్టు 5 : పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటన చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అందుకు సంబంధించిన కసరత్తును కూడా చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ‘పంచాయతీరాజ్ చట్టం-2018’ ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2024, జనవరి 31న ముగిసింది. 2024 ఫిబ్రవరి నుంచి నూతన గ్రామ పంచాయతీలు, వార్డులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
అయితే, శాసనసభ ఎన్నికలు, నూతన ప్రభుత్వ ఏర్పాటు వంటి కారణాల వల్ల పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. పల్లెల్లో ప్రత్యేక అధికారులను నియమించి పాలన కొనసాగిస్తోంది. అయితే ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్షలో పంచాయతీ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక ప్రకటన చేశారు. పంచాయతీ ఎన్నికలను ఆగస్టు నెలలో నిర్వహించాలని, కసరత్తు ప్రారంభించాలని కలెక్టర్లను ఆదేశించారు. దీంతో ఖమ్మం జిల్లాలో ఉన్న 20 పంచాయతీరాజ్ మండలాల్లో 589 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.
పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో జిల్లాలో ఉన్న 589 గ్రామ పంచాయతీల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. తొలిదశ ఎన్నికలు ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమైతే.. అదే నెల చివరి వరకు ఎన్నికల ప్రక్రియను ముగిస్తారు. దీంతో నూతన పాలక వర్గాలు కొలువు తీరనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు. అప్పుడే ఉప సర్పంచ్నూ ఎన్నుకుంటారు.
గతంలో ఖమ్మం రూరల్ మండలంలో పట్టణీకరణ చెందిన గ్రామాలను నాటి పరిస్థితుల రీత్యా ఖమ్మం నగర పాలక సంస్థలో విలీనం చేశారు. వాటిలో పోలేపల్లిలో కొంతభాగంతోపాటు ఏదులాపురం, పెద్దతండా, గుర్రాలపాడు, చిన్న వెంకటగిరి, గుదిమళ్ల గ్రామాలను పూర్తిగా నగరంలో విలీనం చేశారు. అయితే 2018 పంచాయతీ ఎన్నికల్లో ఆయా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అయితే మారిన రాజకీయ పరిణామాల క్రమంలో ఆయా పంచాయతీలను తిరిగి గ్రామ పంచాయతీలుగా మారుస్తూ ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి వాటికి పంచాయతీ ఎన్నికలుగానీ, మున్సిపల్ ఎన్నికలుగానీ జరగలేదు. దీంతో అవి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుత పంచాయతీల ఎన్నికల కసరత్తు నేపథ్యంలో ఈ విలీన గ్రామాల ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. ‘వీటిల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారా?, అసలు వీటి రిజర్వేషన్లు ఏమిటి?’ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించాం. గత రిజర్వేషన్లను కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. ఓటర్ల జాబితా రూప కల్పనతోపాటు అధికార యంత్రాంగానికి శిక్షణ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఎన్నికల పనులు ముమ్మరం చేస్తాం.
-హరికిషన్, డీపీవో, ఖమ్మం