ఖమ్మం, అక్టోబర్ 29: పాలేరు నియోజకవర్గంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నిర్మించాలనే ఆలోచన ముమ్మాటికీ సీఎం కేసీఆర్‌దేనని, కానీ తన ఆలోచనగా మాజీ బయట ప్రచారం చేసుకుంటున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని వాసవి గార్డెన్స్‌లో ఆదివారం ఆర్యవైశ్య ప్రముఖులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. తుమ్మల తనను తాను అపర భగీరథుడితో పోల్చుకుంటున్నారని, నిజానికి ప్రాజెక్ట్‌లు నిర్మించి, చెరువులను బాగు చేసిన సీఎం కేసీఆర్ నిజమైన భగీరథుడని కొనియాడారు. సీఎం కేసీఆర్‌కు గతంలో మంత్రి పదవి ఇప్పించానని తుమ్మల ప్రగల్భాలు పలుకుతున్నారని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఏ ఎన్నికలోనూ ఓటమి పాలవలేదన్నారు. కానీ తుమ్మల మాత్రం పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోతున్నారన్నారు. తాను గెలిచినా, ఓడినా ఖమ్మంలోనే ఉంటానని, కానీ తుమ్మలకు అది సాధ్యం కాదన్నారు. వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసిన సంస్కృతి తుమ్మలది అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అసమ్మతి సెగ తగులుతూనే ఉంటుందన్నారు.
ఇప్పటి వరకు ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో కూడా ప్రకటించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తే పవర్ కట్ తప్ప ఇంకేమీ ఉండదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్య వైశ్యుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. కొంతమంది కుహానా మేధావులు వారికే అంతా తెలిసినట్లు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారన్నారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆర్య వైశ్యులను కించపరిచేలా పుస్తకం రాసి విడుదల చేసినప్పుడు తాను ఆర్యవైశ్యులతో కలిసి ఆందోళన చేశానని గుర్తుచేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల సమయంలో ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అధ్యక్షుడిగా ఉండాలని చిన్ని కృష్ణారావును ఏకగ్రీవంగా ఎన్నుకునేలా కృషి చేశానన్నారు. గాంధీచౌక్‌ను సుందరీకరించానన్నారు. త్రీ టౌన్ ప్రాంతంలో గోళ్లపాడు చానెల్‌ను ఆధునీకరించానన్నారు. ఇప్పుడు ఒక పార్టీలో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి తుమ్మల తనను గత ఎన్నికల్లో ఓడించేందుకు తీవ్రంగా యత్నించారని ఆరోపించారు. 2014లో తనపై పోటీ చేసి ఓడిపోయిన తుమ్మలను సీఎం కేసీఆర్ పిలిచి మంత్రి పదవి ఇచ్చారన్నారు. అనంతరం సుమారు 2 వేల మంది ఆర్యవైశ్యులు మంత్రి అజయ్‌కుమార్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఆర్యవైశ్య ప్రముఖులు గుర్రం ఉమా మహేశ్వరరావు, చెరుకూరి కృష్ణమూర్తి, చిన్ని కృష్ణారావు మాట్లాడుతూ.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెంటే తమ ప్రయాణమని స్పష్టం చేశారు. పువ్వాడను ఎన్నికల్లో గెలిపించేందుకు తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తామన్నారు. మంత్రి ఇప్పటివరకు వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఉన్నారని, తమకు ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా చూసుకున్నారన్నారు. అలాంటి నేతను గెలిపించుకుంటే వ్యాపార వర్గాలకు అన్నివిధాలా ప్రయోజనమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్, జీవీ మాల్ అధినేత గుర్రం ఉమామహేశ్వరరావు, భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, విద్యావేత్త పులిపాటి ప్రసాద్, ఇతర ప్రముఖులు వేములపల్లి వెంకన్న బాబు, గుర్రం తిరుమలరావు, కొత్త వెంకటేశ్వర్లు దేవత అనిల్, కురువెళ్ల ప్రవీణ్, గోళ్ల రాధాకృష్ణ, నరేశ్, టీవీ బాబు పాల్గొన్నారు.