ఖమ్మం రూరల్, జనవరి 15: అన్నను తీసుకురావడానికి వెళ్లిన తమ్ముడు ఈ నెల 13న ఖమ్మం జిల్లా రూరల్ మండలం కరుణగిరిలో అదృశ్యమయ్యాడు. మూడు రోజుల తర్వాత కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోని సాగర్ కాల్వ లాకుల వద్ద శవమై తేలాడు. దీనికి కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీవాసులు ఖమ్మం నగరంలోని జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి ప్రాంతంలో ఉన్న రాజీవ్ స్వగృహలో నివాసం ఉంటున్న పందెపు సంజయ్‌కుమార్..
హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న తన అన్న జ్ఞానసాయిని తీసుకొచ్చేందుకు ఈ నెల 13న అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే పది నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు అన్న సెల్‌ఫోన్‌కు తమ్ముడు వాయిస్ మెసేజ్ చేశాడు. ‘తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొడుతున్నారు. ఆటోలో ఉన్నా. అదే ఆటోలో ఓ అమ్మాయి శవం కూడా ఉంది’ అని వాయిస్ మెసేజ్ ఉంది. దీంతో వెంటనే సాగర్ కాల్వ కట్ట వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులకు సంజయ్ జాడ తెలియరాలేదు. అక్కడ అతడి బైక్ మాత్రమే కనిపించడంతో ఆందోళనకు గురైన సదరు కుటుంబ సభ్యులు, కాలనీవాసులు పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మరుసటి రోజు సంజయ్ మిస్సింగ్‌పై కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తనికెళ్ల సాగర్ లాకుల వద్ద శవం లభ్యం
ఈ నెల 13న అర్థరాత్రి అదృశ్యమైన సంజయ్‌కుమార్ మంగళవారం కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోని సాగర్ కాల్వ లాకుల వద్ద శవమై తేలాడు. ఉదయం అటువైపు వెళ్లిన కొందరు వ్యక్తులకు లాకుల వద్ద శవం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సంజయ్ మృతదేహంగా అనుమానించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. దీంతో విగతజీవిగా ఉన్న సంజయ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అదృశ్యమైన సంజయ్గా నిర్దారణ అయిన తర్వాత మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించారు. బుధవారం పోస్టుమార్టం చేయించారు. మృతదేహం వద్దే అతడి సెల్‌ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మృతుడి ప్యాంటు జేబులో పగిలిన క్వార్టర్ మందు బాటిల్‌ను సైతం పోలీసులు కనుగొన్నట్లు తెలుస్తున్నది. దుండగులు కొడితే సెల్‌ఫోన్ జేబులో ఎలా ఉంది? మద్యం అలవాటులేని అతడి జేబులోకి పగిలిన బాటిల్ ఎలా వచ్చింది? అనేది తేలాల్సి ఉంది.
న్యాయం చేయాలంటూ ధర్నా
సంజయ్ మృతికి కారణం ఎవరో తెలపాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కరుణగిరి వద్ద రాజీవ్ గృహకల్ప కాలనీవాసులు, బాధిత కుటుంబ సభ్యులు బుధవారం భారీ ధర్నా చేపట్టారు. సంజయ్ ఫ్లెక్సీలతో జాతీయ రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. పోస్టుమార్టం అనంతరం కాలనీకి మృతదేహం తీసుకొన్ని వాహనానికి అడ్డుగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. దాదాపు గంటకు పైగా ధర్నా చేపట్టడంతో ఇరువైపులా వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రూరల్ సీఐ ఎం.రాజు ఆందోళనకారులకు నచ్చజెప్పినా ఫలితం లేకుండాపోయింది. విషయం తెలుసుకున్న రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, నగర ఏసీపీ రమణమూర్తి ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని, సంజయ్ మృతి మిస్టరీ ఛేదించడంలో పోలీసు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని నినాదాలు చేశారు. మరోసారి వారితో చర్చలు జరిపినా ఫలితం లేకుండాపోయింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. బలవంతంగా ఎత్తుకెళ్లారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. సాయంత్రం సంజయ్ స్నేహితులు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.