కొత్తగూడెం ప్రగతి మైదాన్, మార్చి 20 : తుపాకుల మోతతో దండకారణ్యం రక్తసిక్తమైంది. భీకర పోరులో ఎటు చూసినా యుద్ధ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతిచెందాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ రేంజ్ పరిధి బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు పెద్ద ఎత్తున సమావేశమవుతున్నట్లు పోలీస్ అధికారులకు సమాచారం అందింది. దీంతో జిల్లా రిజర్వు గార్డ్స్(డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్), సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు సంయుక్తంగా పీడియా అడవుల్లో బుధవారం రాత్రి సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి.
ఈ క్రమంలో ఉదయం 6:30 గంటల సమయంలో జవాన్లకు మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించగా.. ఇరువర్గాల మధ్య సుమారు నాలుగు గంటలపాటు భీకర పోరు సాగింది. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఒక డీఆర్జీ జవాన్ పరిస్థితి విషమించి మృతిచెందాడు. జవాన్లు తమ వేగాన్ని పెంచుతూ ముందుకెళ్లడంతో వారి ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే అక్కడి నుంచి పారిపోయారు.
కాల్పుల విరమణ తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో భారీ ఎత్తున మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి 26 మంది మావోయిస్టుల మృతదేహాలతోపాటు వారికి సంబంధించిన ఆటోమెటిక్, సెమీ ఆటోమెటిక్ వంటి తదితర ఆయుధ, వస్తు సామగ్రిని భారీ ఎత్తున జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మరికొందరు మావోయిస్టులు తీవ్రంగా గాయపడినట్లు పోలీస్ అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కాంకేర్-నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దు చోటేబేథియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోరోస్కోడో గ్రామ సమీప అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పాటిలింగం వెల్లడించారు.
ఏకకాలంలో రెండు జిల్లాల్లో జరిగిన దాడుల్లో మొత్తం 30 మంది మావోయిస్టులు సహా ఓ డీఆర్జీ జవాన్ మృతిచెందినట్లు పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న ఆపరేషన్ ‘కగార్’ మావోయిస్టులను తుడిచిపెట్టడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నది. కాగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ‘ఎక్స్’ వేదికగా ఈ ఎన్కౌంటర్నుద్దేశించి పోస్టు చేశారు. ‘మోదీ సర్కార్ మావోయిజాన్ని తుదముట్టించడమే లక్ష్యంగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నది. 2026, మార్చి 31వ తేదీ నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారుతుంది’ అంటూ ఘాటైన పోస్టు చేయడం సంచలనంగా మారింది.