ఖమ్మం రూరల్: ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలల బలోపేతమే ప్రధాన ఎజెండాగా ఆరేళ్ల పాటు సేవలందించిన అలుగుబెల్లి నరసింహారెడ్డిని మరోసారి ఉపాధ్యాయులు ఆశీర్వదించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయి ప్రభాత్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాయితీ, నిబద్ధతకు అలుగుబెల్లి మారుపేరు అన్నారు.
గడిచిన ఆరేండ్ల కాలంలో ఎమ్మెల్సీ నిధులకు సంబంధించి రూ.9 కోట్ల గాను 9 కోట్లు పాఠశాలల అభివృద్ధి కోసం వెచ్చించిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. తన నెలసరి వేతనం సైతం పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వెచ్చించారని తెలిపారు. ప్రస్తుత ఖమ్మం, వరంగల్ నల్లగొండ టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థులు అనేక మాయ మాటలు చెబుతున్నారని, ఉపాధ్యాయులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి14 నెలలు గడిచినా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండి అలుగుబెల్లిని మొదటి ప్రాధాన్యత ఓటుతోనే అఖండ విజయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టిపిటిఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు రంజాన్, సెక్రటరీ షరీఫ్, నాయకులు రాజశేఖర్ ప్రసాద్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.