ఖమ్మం రూరల్, జులై 04 : తాతల ధర్మాన కోటలు కట్టిస్తే, మనుమల పుణ్యాన పుట్టి ముంచినట్లుంది ఎదులాపురం మున్సిపాలిటీ ఖమ్మం రూరల్ మండలం అధికారుల తీరు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజలకు స్మశాన వాటిక సమస్య శాపంగా మారింది. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 70 వేల జనాభా కలిగిన ఎదులపురం మున్సిపాలిటీ ఏర్పాటు జరిగి నేటి వరకు ఆరు నెలలు కావస్తున్నా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయకపోవడంతో మున్సిపాలిటీ పరిధిలోని అనేక కాలనీల ప్రజలు నిత్యం నానాయాతలు పడుతున్నారు. చివరకు ప్రాణాలు పోయిన తర్వాత సైతం ఆఖరి మజిలీ కార్యక్రమాలు చేసుకునే అవకాశం లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్వపు రూరల్ మండల కేంద్రం ప్రస్తుత ఎదులాపురం మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ లో ప్రజల సౌకర్యార్థం పూర్వపు కాలంలో దాతలు స్పందించి మొన్నేటి కాల్వ పక్కన స్మశాన వాటికకు అనుమతి ఇచ్చారు. దీంతో దశాబ్దాలుగా ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలోనే దహన సంస్కారాలు చేసుకుంటూ సమాధుల నిర్మాణాలు చేశారు. అయితే గత కొద్ది నెలలుగా మున్సిపాలిటీ అధికారులు ఇదే ప్రాంతంలో వివిధ కాలనీల్లో సేకరించిన చెత్తను డంప్ చేస్తుండడంతో అది కాస్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి స్మశాన వాటికలో సమాధులు కనపడకుండా, అసలు స్మశాన వాటికనేదే లేకుండా చేసింది. చెత్తకుప్పలు ఎక్కువ కావడంతో వాటి నుంచి వెలువడుతున్న దుర్వాసన సమీప కాలనీ వాసుల అనారోగ్యాలకు కారణమౌతుంది.
గురువారం రాత్రి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ లో ఖమ్మం రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇదే ప్రాంతంలో దహన సంస్కరణలు చేయాల్సి వచ్చింది. అయితే ఆ ప్రాంతం పూర్తిగా చెత్తాచెదారంతో నిండి ఉండడాన్ని చూసిన కాలనీవాసులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మశాన వాటికను డంపింగ్ యార్డ్ గా మార్చి చివరకు ఆఖరి మజిలీ కార్యక్రమాలు చేయకుండా చేస్తున్నారని ఆగ్రహావేషాలు వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన మున్సిపాలిటీ అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్, జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ఆయా డివిజన్ల ప్రజలు కోరుతున్నారు.
Khammam Rural : డంపింగ్ యార్డ్‌గా స్మశాన వాటిక.. ఆఖరి మజిలీ సాగేదెట్లా ?