కారేపల్లి, జూన్ 24 : విద్యుత్ షాక్కు గురై రెండు పాడి బర్రెలు మృతిచెందాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కారేపల్లి గ్రామానికి చెందిన రైతు ఇమ్మడి సీతారాములు పాడి బర్రెలను సుబ్బయ్య కుంట సమీపంలో మేతకు తీసుకు వెళ్లగా వ్యవసాయ భూమిలో విద్యుత్ తీగలు నేల మీద పడి ఉన్నాయి. దీంతో విద్యుత్ ప్రసారమవుతున్న తీగలు తగిలిన బర్రెలు రెండు అక్కడికక్కడే మృతి చెందాయి. కుటుంబానికి జీవనాధారమైన పాడి బర్రెలు కరెంటు షాక్తో చనిపోవడంతో రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. బాధిత రైతుకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించాలని స్థానికులు డిమాండ్ చేశారు.