నమస్తే నెట్వర్క్, ఆగస్టు 25 : పరిపాలన చేతకాకపోతే వెంటనే పదవుల నుంచి దిగిపోవాలని కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 20నెలలు కావస్తున్నా ప్రజలకు చేసిందేమీలేదని విమర్శించారు.
కనీసం రైతులు పండిస్తున్న పంటలకు ఎరువులను కూడా అందించలేని దుర్భర స్థితిలో ఉందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా కొరత ఎప్పుడూ లేదని గుర్తుచేశారు. యూరియా లేకపోతే పంటల పెరుగుదల నిలిచిపోవడంతోపాటు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. రైతులు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు.. ఎంత యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు అవసరం ఉంటుందో పాలకులకు తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నిత్యం రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సొసైటీల వద్ద బారులు తీరుతున్నా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చెప్పులను క్యూలో పెట్టి రాత్రింబవళ్లు ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేదని విమర్శించారు. సుజాతనగర్ మండల కేంద్రంలోని రబీ హైబ్రీడ్ సీడ్ వ్యవసాయ క్షేత్ర సందర్శనకు వచ్చిన కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌కు బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందించారు. అశ్వారావుపేట రైతువేదిక ఎదుట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతూ నిరసన తెలిపారు. ఇల్లెందు ఏడీఏ కార్యాలయం వద్ద ధర్నాలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, ఉమ్మడి ఖమ్మంజిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ పాల్గొన్నారు. కొత్తగూడెం రైతువేదిక వద్ద మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు బైఠాయించారు. మణుగూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు.