ఖమ్మం, నవంబర్ 19 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం మొదలైందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. కేవలం ఉచిత హామీలతోనే అధికారంలోకి రావడం, పాలన ప్రారంభించిన 11 నెలలైనా హామీల అమలులో ఘోర వైఫల్యం చెందడం వంటివే ఇందుకు కారణమని తేల్చిచెప్పారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అని వర్గాల ప్రజల నుంచి ఇంత పెద్ద స్థాయిలో వ్యతిరేకతను తెచ్చుకున్నది దేశంలోకెల్లా రేవంత్ ప్రభుత్వం మాత్రమేనని ఎద్దేవా చేశారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల విధానాలను చూసిన ప్రజలు.. బీఆర్ఎస్కు ఆక్సీజన్‌ను అందిస్తున్నారని అన్నారు. సీఎం వ్యవహార శైలితో కాంగ్రెస్ నాయకులే అస్త్రసన్యాసం చేస్తున్నారని విమర్శించారు.
ఈ ప్రభుత్వంపై రైతులు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులూ రైతులకు న్యాయం చేయలేకపోతున్నారని విమర్శించారు. ఎన్నెస్పీ కాలువకు పడిన గండిని పూడ్చేందుకే ఈ ప్రభుత్వానికి నెల సమయం పట్టిందంటే.. ఇక రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని విమర్శించారు. రైతులేగాక మహిళలు, కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు కూడా ఈ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని స్పష్టం చేశారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలు ఇప్పటి నుంచే ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారని అన్నారు. అందుకని బీఆర్ఎస్ నాయకులు ఈ విషయాన్ని గమనించి ప్రజాక్షేత్రంలో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలు మూసివేస్తున్నారని; మిర్చి, పత్తి ధరలు అమాంతం పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ పేరుతో పత్తిని, కొర్రీలతో ధాన్యాన్ని కొనకపోవడంతో అన్నదాతలు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం అల్లుడి కోసమే లగచర్ల భూములు..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన అల్లుడి ఫార్మా కంపెనీకి భూములను అప్పగించేందుకే లగచర్ల ప్రాంతంలో గిరిజన రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని విమర్శించారు. భూములు ఇవ్వబోమంటున్న రైతులపై బలవంతంగా కేసులు పెడుతున్నారని, వారిని జైళ్లకు పంపుతున్నారని అన్నారు. లగచర్ల గిరిజన రైతుల ఉద్యమానికి మద్దతుగా, రైతులకు సంఘీభావంగా ఈ నెల 21న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ ర్యాలీలో పాల్గొనేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే, 22న ఖమ్మం ఏఎంసీలోని పత్తి, మిర్చి యార్డులను హరీశ్‌రావు పరిశీలించి రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకుంటారని అన్నారు. మద్దతు ధరలపై రైతులతో అక్కడే ముఖాముఖి కార్యక్రమం చేపడతారని అన్నారు. అనంతరం చింతకాని మండలంలో పర్యటించనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ నాయకులు పెట్టిన అక్రమ కేసుల వల్ల బీఆర్ఎస్ చింతకాని మండల అధ్యక్షుడు ఇటీవల జైలుకు వెళ్లి వచ్చినందున హరీశ్‌రావు వెళ్లి ఆయనను పరామర్శిస్తారని తెలిపారు. ప్రొద్దుటూరు, లచ్చగూడెంలలో మృతిచెందిన రైతుల కుటుంబాలను పరామర్శిస్తారని అన్నారు.
బీఆర్ఎస్ది ఎప్పుడూ ప్రజల పక్షమే : సండ్ర, లింగాల
అధికారం ఉన్నా, లేకున్నా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని బీఆర్ఎస్ నేతలు సండ్ర వెంకటవీరయ్య, లింగాల కమల్‌రాజు, కొండబాల కోటేశ్వరరావు, ఆర్జేసీ కృష్ణ పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజల ఆదరాభిమానాలే శాశ్వతమని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించి శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. మధిరలో ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి మరో షాడో మంత్రిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆమె చెప్పినట్లుగానే పోలీసులు నడుచుకుంటున్నారని, బీఆర్ఎస్ నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు. పార్టీ నాయకులు బిచ్చాల తిరుమలరావు, వెంకటరమణ, ఖమర్ తదితరులు పాల్గొన్నారు.