ఖమ్మం, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్తోనే ఇల్లెందు నియోజకవర్గంలో అభివృద్ధికి కొనసాగింపు ఉంటుందని, ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే నియోజకర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు హరిప్రియానాయక్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నిత్యం బిజీ బిజీగా ఉంటున్నారు. జిల్లా పరిధిలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాలతోపాటు నియోజకవర్గంలో భాగమైన మానుకోట జిల్లా గార్ల, బయ్యారం మండలాలు, ఖమ్మం జిల్లా పరిధిలోని కామేపల్లి మండలంలోనూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదేనని, నియోజకవర్గ ప్రజలు తనకే పట్టంకడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఆమె ‘నమస్తే’తో ముచ్చటించారు. పలు విషయాలను వెల్లడించారు.
ఇల్లెందును ఇప్పటికీ ప్రజలు బొగ్గుట్ట అని పిలుచుకుంటారు. ఇక్కడి సింగరేణి జేకే-5 గని ద్వారా వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. పూసపల్లిలో మరో ఓసీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. గతంలో నియోజకవర్గ రైతులు సాగునీటి కోసం అల్లాడిపోయేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా మిషన్ కాకతీయ అమలు చేశారు. పథంలో భాగంగా చెరువులు, కుంటల పునరుద్ధరణ జరిగింది. చెరువు కట్టలు బలపడ్డయి. రైతుల సాగునీటి కష్టాలు తీరినయి. అలాగే ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రతిష్ఠాత్మంగా సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తయితే నియోజకవర్గంలో సాగునీటికి డోకా ఉండదు. గతంలో ఏజెన్సీవాసులు జబ్బున పడితే కొత్తగూడెం, ఖమ్మం వంటి ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకునేవారు. వైద్యానికి వేలాది రూపాయాలు వారికి ఖర్చు చేసేవారు. సర్కార్ గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఇల్లెందులో ఆధునాతన సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మించింది. నేను ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేశాను. నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు ఐటీఐ చదువుకునేందుకు వీలుగా ఇల్లెందులో ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయించాం.
ఇల్లెందు నియోకవర్గంలో ఈసారి జరుగుతున్న ఎన్నికలు అభివృద్ధికి, ప్రలోభాలకు మధ్య జరిగే ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతున్నది. ఇతర పార్టీలకు చెందిన నేతలతో బేరసారాలు సాగిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది. బయ్యారంలో ఉక్కు కర్మాగారం రావాలని బీఆర్ఎస్ ఫ్రభుత్వం ఎంతో కృషి చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇక్కడ లభించిన ఇనుప ఖనిజం ఇతర ప్రాంతాలకూ రవాణా అయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు నాణ్యత పేరుతో అనేక అడ్డంకులు సృష్టిస్తూ కర్మాగారాన్ని అడ్డుకుంటున్నది. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లాలో కర్మాగారం నిర్మించాలని పూనుకుంటున్నది. ఎన్నికల్లో గెలిచి రానున్న రోజుల్లో బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని తెచ్చుకునే వరకు పోరాటం చేస్తా. కర్మాగారం కోసం నేను గతంలో 36 గంటల నిరసన దీక్ష చేశా. ఇదే ఉద్యమ స్ఫూర్తి మున్ముందూ కొనసాగిస్తా.
ఇల్లెందులో బస్‌డిపో ఉండాలనేది ఏజెన్సీవాసుల చిరకాలవాంఛ. వారి కలలను నెరవేరుస్తూ బస్‌డిపో తీసుకువచ్చాం. నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నడూ శాసనసభ్యురాలిగా, హైదరాబాద్‌లోనే ఉండే వ్యక్తిగా చూడడం లేదు. తమ ఇంటి బిడ్డగా చూస్తునానరు. పిలిస్తే పలికే ప్రజాప్రతినిధిగా నన్ను గుర్తిస్తున్నారు. ‘సమస్య ఎక్కడ ఉంటే అక్కడ హరిప్రియ ఉంటుంది..’ అనే పేరు ఇక్కడే ఉంది. అలాగే చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ప్రజలకు బీఆర్ఎస్పైనా నమ్మకం పెరిగింది. వారు బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. కరోనా సమయంలో నేను గర్భిణిని. అయినప్పటికీ ప్రతి గిరిజన తండాకు వెళ్లి బాధితులకు వైద్యసాయం అందించాను. నిత్యావసర సరుకులు అందించాను.