మణుగూరు టౌన్, జూన్ 18: అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్దకు పార్టీ శ్రేణులు చేరుకోవడంతో కార్యక్రమానికి అనుమతి లేదని సీఐ నాగబాబు, ఎస్సై మేడా ప్రసాద్, ట్రైనీ ఎస్సై మనీషా వారిని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే రేగా కాంతారావు మండలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారని, ఈలోగా ఎన్నికలు రావడంతో కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం లేదని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే పనుల విషయంలో కాలయాపన చేస్తున్నారని, తక్షణమే పెండింగ్లో ఉన్న ఆయా పనులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మణుగూరు అంబేద్కర్ సెంటర్ నుంచి రూ.10 కోట్ల వ్యయంతో బాంబే కాలనీ వరకు సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పు, బాంబే కాలనీలో ఉన్న గాంధీ విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం నిధులు కూడా మంజూరయ్యాయని గుర్తు చేశారు.
అంబేద్కర్ సెంటర్ నుంచి చినరాయిగూడెం వరకు నిలిచిపోయిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కుంట లక్ష్మణ్, నాయకులు యాదగిరి గౌడ్, ఆవుల నరసింహారావు, అక్కి నరసింహారావు, వేల్పుల సురేశ్, ప్రభుదాస్, ఎడవల్లి వెంకటయ్య, జావీద్, బాషా, మేకల రవి, మడి వీరన్నబాబు, సఖిని బాబురావు, కలగూర శంకర్, తురక రాంకోటి, కమ్మపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.