ఇల్లెందు, ఏప్రిల్ 17 : రాష్ట్ర విభజనపై అవగాహన రాహిత్యంతో మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్.. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇల్లెందు జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో శుక్రవారం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో మహిళా బిల్లుపై మాట్లాడకుండా తెలంగాణ ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చి మాట్లాడటం సరికాదన్నారు. ఇది భారత రాజ్యాంగాన్ని, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించినట్లే అవుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటు కోసం బీజేపీ కూడా తెలంగాణ జేఏసీలో భాగస్వామిగా ఉండి రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసిందని, తెలంగాణ బిల్లుకు పార్లమెంట్లో గట్టి మద్దతు ఇచ్చిందనే కనీస సోయి కూడా లేకుండా ఆయన మాట్లాడటం విచారకరమన్నారు.
ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడిన తేజస్వీ సూర్యను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు ఎస్.రంగనాథ్, సిలివేరి సత్యనారాయణ, అబ్దుల్ జబ్బార్, శీలం రమేశ్, పరుచూరి వెంకటేశ్వర్లు, ఘాజి, అజ్మీర బావ్సింగ్, దాస్యం ప్రమోద్, డేరంగుల పోశం, నాగరాజు, వసంతరావు, శ్రీను, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.