పాల్వంచ, ఆగస్టు 18 : రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కొద్దిమందికి మాత్రమే చేసి మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డి తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కిలారు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పాల్వంచలో ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలను 420 హామీలతో మోసం చేసిందన్నారు. రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లినా ఒక్కరిద్దరుకు తప్ప మిగిలిన ఎవ్వరికీ కూడా రూ.2 లక్షల రుణం మాఫీ కాలేదని ఆరోపించారు.
పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ పరిధిలో 1,832 మంది రైతులు అర్హులు ఉండగా రూ.లక్ష లోపు 436మంది, రూ.1.50 లక్షలలోపు 94 మంది, రూ.2 లక్షలలోపు 61మందికి మాత్రమే రుణం మాఫీ అయ్యిందన్నారు. మిగిలిన రైతులకు అన్ని అర్హతలున్నా ఎందుకు మాఫీ కాలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్రావు క్యాంప్ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ అల్లరిమూకలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పాల్వంచ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, బట్టు మంజుల, జూపెల్లి దుర్గాప్రసాద్, కాలేరు సింధు తపస్వి, పత్తిపాటి శ్రీనివాసరావు, వాడపల్లి మహేష్, కంచర్ల రామారావు, వల్లపిన్ని వెంకటేశ్వర్లు, తోట లోహిత్ సాయి పాల్గొన్నారు.