ఖమ్మం, డిసెంబర్ 2 : ఖమ్మం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా పేద విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు, ఖమ్మం జిల్లా ఇన్చార్జి డాక్టర్ కందుల మధు అన్నారు.
సోమవారం ఖమ్మంలోని తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకుల ప్రతినిధి బృందం గత మూడ్రోజులు ఖమ్మం జిల్లాలోని గురుకుల పాఠశాలలు, కళాశాలలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించినట్లు తెలిపారు. అపరిశుభ్రమైన వాతావరణంలో కనీస సౌకర్యాలు లేకుండా గురుకులాలు దర్శనమిస్తున్నాయని, పౌష్టికాహారం, నాణ్యమైన విద్య లేకపోతే విద్యార్థులు ఎకువ నష్టపోతారన్నారు.
తక్షణమే మంత్రులు చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలల ముట్టడికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ ఏడాది కాంగ్రెస్ పాలనలో 350 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురై 40 మందికిపైగా చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. కొంతమంది గురుకులాల ఉద్యోగులు కాంగ్రెస్ ఏజెంట్లుగా ప్రవర్తిస్తున్నారని, వారి తీరు మార్చుకోకపోతే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, బీఆర్ఎస్వీ కో ఆర్డినేటర్లు కోరేపల్లి మహర్షి, పండు, ఉపేందర్‌రెడ్డి, మేడి అనిల్, మామిడి భాసర్ పాల్గొన్నారు.