మణుగూరు టౌన్, ఆగస్టు 21 : ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన రైతులందరి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ రేగా కాంతారావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రూ.2 లక్షల రుణాలు మాఫీ అయ్యాయని చెబుతుంటే.. మంత్రులు మాత్రం ఇంకా కాలేదని చెబుతుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రూ.2 లక్షల రుణమాఫీ అందరికీ వర్తింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
బడ్జెట్లో రూ.26 వేల కోట్లలో కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి ప్రభుత్వం రైతులను నిలువునా ముంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో లక్షలాది మంది రైతులు రోజూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి దాపురించిందన్నారు. లక్షలాది మంది రైతులకు అండగా ఉండేందుకు గురువారం అన్ని మండల కేంద్రాలతోపాటు నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టే ధర్నాలకు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ అందే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.