మిర్యాలగూడ, మే 21 : ‘అసెంబ్లీ ఎన్నికల్లో అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇంతవరకూ ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేసి మళ్లీ మోసపోవద్దు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్, రచయిత, ఉద్యమకారుడు అన్నారు. అమెరికాలో ఫేస్బుక్ వంటి సంస్థల్లో ఉద్యోగం చేసి వాటిని వదులుకొని ప్రజా జీవితంలో అడుగుపెట్టిన ఉత్సాహవంతుడు అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ విద్యావంతుల సైన్యమని, విద్యావంతులకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. పదేండ్లలో నిష్టతో తెలంగాణను అభివృద్ధి చేశామని, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు, తాగునీరు, విద్య, వైద్యం, పట్టణ, గ్రామీణ అభివృద్ధి వంటి ఏ రంగంలోనైనా తనదైన ముద్ర వేసి తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిందని చెప్పారు. సమగ్ర, సమ్మిళిత, సమతుల్య, సమీకృత అభివృద్ధి సాధించేందుకు ముందుకెళ్లామన్నారు.
2014కు ముందు కరెంట్ ఉండేది కాదని, నీళ్లు ఉండకపోవడంతో బోరుబావులు ఫెయిల్ అయి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పెట్టుబడులన్నీ వెళ్లిపోతాయని, కొత్తవి రావని ఆనాడు పుకార్లు పుట్టించారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తొమ్మిదిన్నరేండ్లలో ఐటీ రంగం అభివృద్ధిలో దూసుకుపోయిందని, బీఆర్ఎస్ హయాంలో పది లక్షల మందికి ఐటీ ద్వారా ఉద్యోగాలను కల్పించిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. ఈసారి గెలిస్తే మిర్యాలగూడకు ఐటీ తీసుకొచ్చేవాళ్లమని తెలిపారు. ఐటీ ఎగుమతులను రూ.57వేల కోట్ల నుంచి రూ.2లక్షల కోట్లకు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఒక వైపు ఐటీ, మరోవైపు వ్యవసాయాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో 14వ స్థానంలో ఉండేదని, 2023లో కేసీఆర్ అధికారం కోల్పోయే నాటికి దేశంలో నెం.1గా నిలిచిందని అన్నారు. దేశం మొత్తంలో తెలంగాణ నెం.1 అయితే.. రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉన్నదని తెలిపారు. 2014 నాటికి నల్లగొండలో ఒక్క మెడికల్ కాలేజీ లేదని, కేసీఆర్ నాయకత్వంలో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని అన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామని, పారిశ్రామిక రంగంలో వెలుగులు తీసుకొచ్చామని చెప్పారు.
24వేల కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి దాదాపు రూ.3.5లక్షల కోట్ల పెట్టుబడులను సాధించుకున్నామన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకొని దేశంలోనే నెం.1గా నిలిచామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం 1.8శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని, పని చేసి కూడా చెప్పుకోలేకపోవడంతోనే ఓటమి పాలయ్యామని తెలిపారు. పదేండ్లలో భారతదేశంలో అత్యధికంగా ప్రభుత్వ కొలువులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రమేనన్నారు. కానీ.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి రాష్ట్రపతితో సంతకం పెట్టించి 95శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చారని తెలిపారు. 2లక్షల ఉద్యోగాలను ఇచ్చి కూడా బీఆర్ఎస్ చెప్పుకోలేదని, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఇవ్వని 30వేల ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, గాడిద గుడ్డు మాత్రం వచ్చిందని విమర్శించారు. కేంద్రంలోని బడే భాయ్ నరేంద్ర మోదీ ఏటా నిరుద్యోగులకు 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే.. చోటే భాయ్ రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఏటా 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కృష్ణా నదిని కేంద్ర అజామాయిషీకి అప్పగించాలని కేసీఆర్‌పై పదేండ్లపాటు ఒత్తిడి తెచ్చినా అప్పగించలేదన్నారు. రేవంత్‌రెడ్డి వచ్చిన నెలలోనే దొంగచాటుగా సంతకం పెట్టి నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించాడని విమర్శించారు.
కేసీఆర్ నల్లగొండకు వచ్చి గర్జిస్తే.. తాము పెట్టలేదని బుకాయించాడన్నారు. మన ప్రాజెక్టులను కేఆర్ఎంబీ చేతుల్లో పెట్టకపోతే నీళ్లు కావాలని మాటిమాటికి కేఆర్ఎంబీకి ఎందుకు ఉత్తరాలు రాస్తున్నాడని ప్రశ్నించారు. మీ చేతుల్లోనే ఉంటే మీరే నీటిని విడుదల చేయొచ్చు కదా? అన్నారు. ఇటీవల కాలంలో 4.5 టీఎంసీల నీటిని సాగర్ నుంచి ఆంధ్రాకు తీసుకెళ్లినప్పటికీ ప్రశ్నించే గొంతుక అని చెప్పుకొనే కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ప్రభుత్వాన్ని ఒక్కసారైనా ప్రశ్నించాడా? అని అడిగారు. 30వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే కిందికి 4.5 టీఎంసీల నీరు ఎలా పోతుందని ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలే దన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించలేరని.. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే ధోరణి ఉంటుందని ఆరోపించారు. ఇప్పుడు కావాల్సింది తెలంగాణ అధికార స్వరం కాదు.. ధిక్కార స్వరం, శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక కావాలని సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపిస్తే శాసనమండలిలో ప్రశ్నించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రైతులందరూ బ్యాంకులకు వెళ్లి రూ.2లక్షలు తెచ్చుకోండి.. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడని, ఇప్పటి వరకూ చేయలేదని విమర్శించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పిన ఆయన.. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేనందునే ముఖ్యమంత్రి కనిపించిన దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారని, ఈ మాట ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తెలంగాణలో 80శాతం దొడ్డు రకం ధాన్యమే పండిస్తారని తెలిపారు. మహిళలకు రూ.2500 భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని, ప్రతి మహిళ అకౌంట్లో రూ.2500 నగదు వేస్తున్నామని కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. రూ.2లక్షల రుణమాఫీ, రూ.15వేల రైతుబంధు, కౌలు రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, ఆటో డ్రైవర్లకు నెలకు రూ.వెయ్యి ఇస్తామని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మోసాలకు పాల్పడుతూ పచ్చి అబద్ధాలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టభద్రులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మరోసారి మోసపోకుండా శాసనమండలిలో ప్రశ్నించే గళం బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ ఐఏఎస్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీగా నన్ను గెలిపిస్తే ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం నిరుద్యోగుల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌కు పత్రాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం కాంగ్రెసోళ్లకే చెల్లింది. డిసెంబర్ 9న హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ సర్కారు మాటలు ఏమాయ్యాయి? ఐదు నెలలైనా ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్, డీఎస్సీ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్సీ ఎందుకు ఇవ్వలేదు. జీఓ 46 ద్వారా కొంత మందికి అన్యాయం జరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం సరిదిద్దే సమయంలో ఎన్నికల కోడ్ వచ్చింది. అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ఎందుకు చేస్తలేదు. విచక్షణ కలిగిన పట్టభద్రులు.. బ్లాక్ మెయిలర్స్ ఎవరో, మంచివారు ఎవరో ఆలోచించి ఓటు వేయాలి. చుక్కా రామయ్య నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరకు విద్యావంతులనే మండలికి పంపారు. జర్నలిజం ముసుగులో ఎర్నలిస్టుగా మారిన వ్యక్తులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.