బోనకల్లు, మార్చి 12 : అమృత్ పథకంలో భాగంగా బోనకల్లు రైల్వే స్టేషన్ సుందరీకరణను సంతరించుకుంది. ఎటుచూసినా ఆహ్లాదకరమైన వాతావరణంతో అద్దంలా మెరుస్తుంది. అన్ని వసతులు కల్పిస్తూ రూ.26 కోట్లతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులతో పాటు తీర్థయాత్రలకు వెళ్లే యాత్రికులతో రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఈ స్టేషన్లో ఆగే రైళ్లు మాత్రం మూడే. గుంటూరు నుంచి సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, తిరుపతి నుంచి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్, డోర్నకల్ నుంచి విజయవాడ ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఈ స్టేషన్లో ఆగుతాయి.
దాంతో ఎంత రద్దీ ఉన్నా, ఎక్కడి వెళ్లాలన్నా ఈ మూడు రైళ్లే ప్రయాణికులకు దిక్కు. ఈ స్టేషన్లో మరికొన్ని రైళ్లను హాల్ట్ చేయాలని కోరుతూ ఎంతోకాలంగా ఈ ప్రాంత వాసులు, ప్రజాప్రతినిధులు రైల్వే ఉన్నతాధికారులకు విన్నవిస్తూ వస్తున్నారు. అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బోనకల్లు రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ, శాతవాహన, పద్మావతి రైళ్లతో పాటు పలు రైళ్లు ఆపాలని కోరుతూ ఇటీవల స్టేషన్ పరిశీలన వచ్చిన సెంట్రల్ రైల్వే సేఫ్టీ ఆఫీసర్ మాదవి, సికింద్రాబాద్ డివిజినల్ మేనేజర్ భరత్‌కుమార్ జైన్‌కు విన్నవించారు.
బోనకల్లు రైల్వే స్టేషన్లో ఈ రైళ్లను నిలుపుదల చేస్తే వైరా మండలం, చింతకాని మండలం, బోనకల్లు మండలంతో పాటు ఏపీలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన వేలాదిమంది ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాంతాల చెందిన ప్రయాణికులు సుదూర ప్రాంతాల నుంచి రావాలన్నా వెళ్లాలన్నా ఖమ్మం, లేక మధిర రైల్వే స్టేషన్‌కు వెళ్లి వారి గమ్యస్థానాలకు వెళ్లవలసిన పరిస్థితి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా రైల్వే అధికారులు ఈ స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలతో పాటు రిజర్వేషన్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.
Bonakallu Railway Station : బోనకల్లు రైల్వే స్టేషన్ సుందరీకరణ.. ఇకనైనా ఆగేనా ఈ రైళ్లు?