రామవరం, మే 27 : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రాల్లో రక్త, మూత్ర, థైరాయిడ్, లివర్, కిడ్నీ, హార్మోన్, క్యాన్సర్ స్క్రీనింగ్, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్, మామోగ్రామ్ వంటి 134 రకాల పరీక్షలు నిర్వహించేవారు. వేలకు వేలు పెట్టి పరీక్షలు చేయించుకోలేని నిరుపేదలకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత రక్త పరీక్షలను నిర్వహించేవారు.
కానీ ప్రస్తుత పాలకుల నిర్లక్ష ధోరణి వల్ల చాలా పరీక్షలు ఆగిపోయాయి. రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ రక్త పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారం మార్గాలను చూపించడంతో పాటు వారిలో ఎక్కువ మంది ఎదుర్కొనే ముఖ్యమైన థైరాయిడ్ పరీక్ష తోపాటు, హార్మోన్ లోపం వల్ల ఏర్పడే విటమిన్ లకు సంబంధించిన పరీక్షలు, కిడ్నీకి సంబంధించిన క్రియాటిన్ పరీక్షలు నిర్వహించి మందులను ఇచ్చేవారు.
గత కొన్ని రోజులుగా ఈ పరీక్షలను నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఖరీదైన ఈ పరీక్షలు చేయించుకోలేక సతమతమవుతున్నారు. గత 15 రోజులుగా పరీక్షలు ఆగిపోయాయని, రోజు ఆయా కేంద్రాల చుట్టూ తిరగవలసి వస్తుందని రోగులు వాపోతున్నారు. గతంలో అధికారులు నెలవారి సమీక్ష నిర్వహించి రక్త పరీక్షలకు సంబంధించిన కిట్స్, ఇతర కెమికల్స్ ను సిద్ధంగా ఉంచేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి సమస్య పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై టీడీ హబ్ మేనేజర్ నిజాముద్దీన్‌ను వివరణ కోరగా 15 రోజులుగా పరీక్షలు ఆగిపోయిన మాట వాస్తవమేనని, పరీక్షలకు కావాల్సిన కన్జంబుల్స్ లేవని, ఆర్డర్ పెట్టామని, ముంబై నుంచి రావాల్సి ఉందని, రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కావచ్చు అని తెలిపారు.