కొత్తగూడెం క్రైం, జనవరి 6 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చిన బిరుదరాజు రోహిత్ రాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి నుంచి హైదరాబాద్‌లోని మాదాపూర్ డీసీపీగా బదిలీపై వెళ్తున్న డాక్టర్ వినీత్ గంగన్నకు జిల్లాలోని పోలీస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. బదిలీపై వచ్చిన రోహిత్ రాజుకి వినీత్ గంగన్న బాధ్యతలు అప్పగించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి పుష్పాలతో అలంకరించిన రథాన్ని వినీత్ గంగన్న అధిరోహించగా.. అధికారులంతా తాడుతో లాగుతూ ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా సాగనంపారు. అలాగే ఎస్పీగా రోహిత్ రాజు బాధ్యతలు స్వీకరించడం పట్ల అధికారులంతా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజుని పోలీస్ అధికారులు, సిబ్బంది గౌరప్రదంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఇద్దరు ఉన్నతాధికారులను సత్కరించిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఆపరేషన్స్) టి.సాయి మనోహర్, ఏఆర్ అదనపు ఎస్పీ విజయ్‌బాబు, ఏఎస్పీ పంకజ్ పరితోష్, డీఎస్పీలు షేక్ అబ్దుల్ రెహమాన్, కేవీ.రమణమూర్తి, ఎన్.వెంకటేశ్, మల్లయ్యస్వామి, ఏ.కృష్ణయ్య, అన్ని విభాగాల ఇన్సెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.