పినపాక, నవంబర్ 20: జనగణన ప్రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్, ఐఏఎస్ భారతి హోలికేరి ఆదేశించారు. మండలంలోని తోగ్గూడెం, మల్లారం, సింగిరెడ్డిపల్లి గ్రామాల్లో చేపట్టిన జనగణన ప్రీ సర్వేను గురువారం ఆమె పరిశీలించారు. ఎన్యూమరేటర్లు చేస్తున్న డిజిటల్ సర్వేలోని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు మండలంలో ఎంపిక చేసిన 7 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 57 బ్లాకుల్లో 10వ తేదీ నుంచి సర్వే నిర్వహిస్తున్నారని అన్నారు.
దీనిని ఏడుగురు సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సర్వేకు భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్గా, తహసీల్దార్ గోపాలకృష్ణ ఛార్జ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 2027లో పూర్తిస్థాయిలో నిర్వహించబోయే సెన్సెస్ సర్వేకు ఇది ప్రీ మోడల్ సర్వే అని, ఈ నెల 30 వరకు ఈ సర్వే కొనసాగుతుందని అన్నారు. ప్రజలందరూ ఎన్యూమరేటర్లకు సహకరించాలని ఆమె కోరారు. జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆర్.శేఖర్, డిప్యూటీ డైరెక్టర్ సుబ్బరాజు, సెన్సెస్ ఆఫీసర్లు సతీశ్, హిమవర్ష, వినయ్ పాల్గొన్నారు.