భద్రాచలం, మార్చి 13 : దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారు శుక్రవారం వెళ్లికొడుకు కానున్నారు. ఏప్రిల్ నెలలో సీతారామ చంద్రస్వామి వారికి కల్యాణం నిర్వహించనుండగా హోలీ పండుగ రోజున స్వామివారికి ముత్తైదువులు రోట్లో పసుపుకొమ్ములు దంచి పెండ్లికొడుకును చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇందులో భాగంగా శుక్రవారం రామాలయంలో డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అంమూర్హం నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చి యాగశాలలో హోమం నిర్వహించారు. శుక్రవారం స్వామి వారి కల్యాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సమయంలో పసుపు దంచడం, తలంబ్రాలు కలిపే పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా సామూహిక పూజను సైతం నిర్వహించనున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ తలంబ్రాల తయారీకి శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది 300 క్వింటాళ్లకు పైగా తలంబ్రాలు సిద్ధం చేసి భక్తులకు అందజేయాలనే లక్ష్యలతో దేవస్థానం అధికారులు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం 25 క్వింటాళ్ల తలంబ్రాలను ముత్తెదువుల సమక్షంలో భక్తులతో కలిసి తయారు చేయనున్నారు. ఈ తలంబ్రాల తయారీని వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలిరానున్నారు. మిథిలా స్టేడియం ఆవరణలో తలంబ్రాల తయారీ ప్రక్రియను నిర్వహించమన్నారు.