కొత్తగూడెం అర్బన్, జూన్ 26 : కుటుంబ పోషణ కోసం రోడ్లు, వీధుల వెంట వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న వీధి వ్యాధుల ఆర్థిక స్థితిగతులను ప్రభుత్వం క్రమక్రమంగా మారుస్తోంది. పొట్టకూటి కోసం రోజంతా కష్టించే వారి బతుకులను బాగు చేసేందుకు రుణాలు అందిస్తూ చేయూతనిస్తోంది. కరోనా లాక్డౌన్తో వీధి వ్యాపారుల బతుకులు అగమగ్యగోచరంగా మారిన విషయం విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో అని కొట్టుమిట్టాడుతున్న తరుణంలో వారికో దారి చూపేందుకు ప్రభుత్వం చిరు, వీధి వ్యాపారులకు విడతల వారీగా వ్యాపారాభివృద్ధి కోసం రుణాలను పంపిణీ చేసున్నది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వారికి రుణాలు అందించడంతోపాటు వెండింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మూడు విడతలుగా రుణ సాయం అందించి దేశంలోనే ఉన్నత స్థానంలో నిలిచాం. లక్ష జనాభా ఉన్న పట్టణాల్లో రుణాలు అందించడంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం 6వ స్థానం, కొత్తగూడెం పట్టణం 8వ స్థానంలో నిలిచి కేంద్ర ప్రభుత్వ మన్ననలు అందుకున్నది.
జిల్లాలో గుర్తించిన వీధి వ్యాపారులు 10,803
జిల్లాలోని మొత్తం నాలుగు మున్సిపాలిటీల్లో మెప్మా రిసోర్స్ పర్సన్లు సర్వే చేయగా.. 10,803 మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు గుర్తించారు. వారికి రుణాలు అందించి అభివృద్ధి కోసం అవసరమైన కార్యాచరణను చేపట్టారు. లక్ష జనాభా ఉన్న పట్టణంలో 5 శాతం తగ్గకుండా వీరిని గుర్తించి రుణాలను అందించాలని సూచించారు. తొలివిడత రూ.10వేలు, రెండో విడత రూ.20వేలు, మూడో విడత రూ.30వేలు, నాల్గవ విడత రూ.50వేలు, ఐదవ విడత రూ.లక్ష చొప్పున అందించేలా ప్రణాళికలు రూపొందించారు. పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు నాలుగు మున్సిపాలిటీల్లో తొలి విడతలో రూ.10వేల రుణాల కోసం 10,803 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతగా 9,769 మందికి రుణాలు మంజూరు చేశారు. తొలివిడత తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించినవారు 3,711 మంది.. రెండో విడత రుణం సైతం పొందారు. ఇక మూడో విడత 357 మంది వీధి వ్యాపారులు రుణాలు పొందారు. ఇప్పటివరకు జిల్లాకు రూ.19.49కోట్ల రుణ సాయాన్ని ప్రభుత్వం వీధి వ్యాపారులకు అందించింది.
వ్యాపారుల్లో మహిళలే అధికం..
వీధులు, ప్రధాన రోడ్ల వెంట చిరు వ్యాపారాలు నిర్వహించేది ఎక్కువగా మహిళలే. కూరగాయల నుంచి మొదలుకొని పూలు, పండ్లు, రెడీమేడ్, గాజులు, ఫ్యాన్సీ వస్తువులు తదితరాలు విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే రుణాలు పొందిన వారిలో మహిళలే మొదటి వరుసలో ఉన్నారు. మొత్తం గుర్తించిన వీధి వ్యాపారుల్లో 7,500కిపైగా మహిళలు ఉండగా.. వారిలో సైతం 5,500 మంది రుణాలు పొందినట్లు అధికారులు తెలిపారు.
రుణాల పంపిణీలో ర్యాంకులు
లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్లో వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయడంలో పాల్వంచ 6వ స్థానం, కొత్తగూడెం 8వ స్థానంలో నిలిచి దేశంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీల పేరును చాటి చెప్పింది. పాల్వంచ మున్సిపాలిటీలో 4,178 మందికి.. 3,505 మంది వ్యాపారులు రుణాలు పొందారు. మొత్తంగా రూ.6.51కోట్లు వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 3,186 మందికి.. 3,008 మందికి రుణాలను ఇవ్వడంతో మొత్తంగా రూ. 5.71కోట్లు వారి వ్యక్తిగత ఖాతాకు జమ చేసింది. ఇల్లెందు మున్సిపాలిటీలో 1,761 మందికి.. 1,616 మందికి రూ.3.47కోట్లు, మణుగూరులో 1,678 మందికి.. 1,640 మందికి రూ. 3.78కోట్లు అందించి వారు వ్యాపారాభివృద్ధి చేసుకునేందుకు ఊతమిస్తున్నది.
సద్వినియోగం చేసుకుంటున్నారు
ప్రభుత్వం అందిస్తున్న రుణాలను వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. రుణాల పంపిణీలో పాల్వంచ మున్సిపాలిటీ దేశంలోనే 6వ స్థానంలో నిలిచింది. కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశాల మేరకు వీధి వ్యాపారుల వివరాలను సేకరించి వారికి రుణాలు అందించాం. తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి విడతల వారీగా మళ్లీ మంజూరు చేస్తున్నాం. ఇప్పటివరకు మూడు విడతలుగా రుణాలు అందించాం.
– చింతా శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్, పాల్వంచ