భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఎన్నికల కోడ్ ముగిసినందున పరిపాలనలో వేగం పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్, డీఆర్వో, కలెక్టరేట్ విభాగాల పర్యవేక్షకులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల విధులు ముగిసినందున పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఫైళ్ల జాప్యానికి అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ-ఆఫీస్ణు తిరిగి ప్రారంభించాలని, దాని ద్వారా ఫైళ్ల ఉత్తర, ప్రత్యుత్తరాలు చేపట్టాలని సూచించారు. ఈ-ఆఫీస్ వల్ల కాగిత రహిత పరిపాలనతోపాటు ఫైళ్లు భద్రంగా ఉంటాయని, తద్వారా సమస్యల సత్వర పరిష్కారానికి దోహదం కలుగుతుందన వివరించారు. అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్వో రవీంద్రనాథ్, ఏవో గన్యా, అన్ని విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు.