భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 26 (నమస్తే తెలంగాణ): అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఆదివారం జరిగిన వేడుకల్లో కలెక్టర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ రోహిత్‌రాజు కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగించారు.
ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించిన గ్రామసభల్లో మరికొందరు దరఖాస్తుదారుల నుంచి నుంచి నాలుగు పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించామని అన్నారు. వీరిలో అర్హులను ఎంపిక చేసి వారికి కూడా పథకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతీ మండలంలోని ఒక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, రైతుభరోసా పథకాల ఫలాలకు పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, గృహజ్యోతి పథకాలను పేదలకు అందిస్తున్నట్లు వివరించారు.
ఇప్పటికే ఇందిరా మహిళా క్యాంటీన్ల ద్వారా స్వయం సహాక సంఘాల మహిళలకు స్వయం ఉపాధిని అందిస్తున్నట్లు గుర్తుచేశారు. జిల్లాలోని చౌక దుకాణాల ద్వారా 8,38,399 మంది కార్డుదారులకు సన్నబియ్యం సరఫరా చేసినట్లు చెప్పారు. వీరితోపాటు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీల విద్యార్థులకు కూడా సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు వివరించారు. పౌరసరఫరాలు, స్త్రీ, శిశు సంక్షేమ, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పరిశ్రమలు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా ఆయా వర్గాల ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్నామని వివరించారు.
విధి నిర్వహణలో ఈ ఏడాది ఉత్తమ ప్రతిభను కనబరిచిన ఉద్యోగులకు కలెక్టర్ జితేశ్, ఎస్పీ రోహిత్‌రాజు, డీఎఫ్‌వో కృష్ణగౌడ్ కలిసి అవార్డులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. భద్రాద్రి జిల్లాలో 88 విభాగాల నుంచి 420 మంది అధికారులు, ఉద్యోగులకు వీటిని అందజేశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. చిన్నారులకు కూడా బహుమతులు ప్రదానం చేశారు. ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాటుచేసిన స్టాళ్లను అతిథులు, జిల్లా ప్రజలు తిలకించారు. కాగా, ఈ వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకాకపోవడంతో ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది.