భద్రాద్రి కొత్తగూడెం, జూలై 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని రైతులు ప్రభుత్వం అందిస్తున్న రుణమాఫీని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రైతు రుణమాఫీ రెండోవిడత నిధులను సీఎం రేవంత్రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. కార్యక్రమంలో భాగంగా ఐడీవోసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన రైతువేదికలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండోవిడతలో జిల్లాలోని రూ.1,50,000 లోపు రుణాలు ఉన్న రైతులందరికీ మాఫీ చేయనున్నట్లు తెలిపారు. 16,377 మంది లబ్ధిదారులకు రూ.137 కోట్ల 21 లక్షల 96 వేల 477వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. అనంతరం రెండో విడత రుణమాఫీ పొందిన రైతులకు కలెక్టర్ చెక్కులు అందజేశారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఏవో బాబూరావు, జిల్లా ఉద్యాన అధికారి సూర్యనారాయణ, జిల్లా సహకార అధికారి ఖుర్షీద్, కేవీకే శాస్త్రవేత్త లక్ష్మీనారాయణమ్మ, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంరెడ్డి, అన్నిబ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.