భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భద్రాచలం రామాలయ అభివృద్ధి ప్రణాళిక, భూ సేకరణ తదితర అంశాలపై దేవాదాయ, రెవెన్యూ, భూమి, కొలతలు, గ్రామపంచాయతీ, ఐటీడీఏ అధికారులతో సమీక్షించారు.
భూ సేకరణకు భద్రాచలం తహసీల్దార్, పంచాయతీ ఈవో, రామాలయ ఈఈ, మండల సర్వేయర్‌తో కూడిన జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాయింట్ కమిటీ ఆలయ అభివృద్ధికి అవసరమైన భూ సేకరణకు సంబంధించిన ప్రణాళికలపై మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలన్నారు.
ఆలయ పరిసరాల్లోని భూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇవ్వాల్సిన అనుకూలమైన భూమిని గుర్తించాల్సిందిగా ఆదేశించారు. రామాలయ భూములకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల పూర్తి వివరాలను అందజేయాలని ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీవో దామోదర్‌ను ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్, భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్, భూమి కొలతలు, సర్వే ఏడీ కుసుమకుమారి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రమాదేవి, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్, కలెక్టరేట్ భూ సేకరణ సీనియర్ సహాయకుడు యాసిన్పాషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.