ఖమ్మం రూరల్, జూన్ 11 : భారీ వర్షాలు, వరదల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ పి.రాంప్రసాద్ అన్నారు. బుధవారం మండలంలోని తీర్థాల గ్రామంలో వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజలతో రాష్ట్ర విపత్తుల నిర్మూలన స్పందన విభాగం (ఎస్డీఆర్ఎఫ్) అవగాహన సదస్సు నిర్వహించారు. తొలుత హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం సభ్యులు మున్నేరు పరివాహక ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. సమీప ప్రాంతాల ప్రజలను కలుసుకుని గతంలో వరదలు వచ్చిన సమయంలో పరిణామాలపై ఆరా తీశారు. అనంతరం తీర్థాల గ్రామంలోని శివాలయం ఆవరణలో తాసీల్దార్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా గతంలో మున్నేరు వరదలకు పడిన ఇబ్బందులు, చోటుచేసుకున్న పరిణామాలను గ్రామస్తులు అధికారులకు వివరించారు. అనంతరం తాసీల్దార్, ఎస్ డి ఆర్ ఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జానయ్య అవగాహన కల్పించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వానాకాలం సీజన్‌కు ముందే మున్నేరు పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు గాను ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే ఇప్పటికే గ్రామ, మండల స్థాయిలో ఆపత్ మిత్ర కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులను ఇందులో సభ్యులుగా చేర్చడం జరిగిందన్నారు. వరదల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దన్నారు. ఇంట్లో ఉన్న కొన్ని పరికరాలతోనే సురక్షితంగా ఎలా బయటపడాలో వివరించారు.
ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఆభరణాలు, ధ్రువపత్రాలను ముందుగా సంచులు, బ్యాగుల్లో వేసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. వరదలు వచ్చిన సమయంలో పశువులను కూడా రక్షించుకోవడం మన బాధ్యత అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పశువులను ఆ సమయంలో కట్టి వేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీఆర్ఎఫ్ ఎస్ఐలు, సిబ్బంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్ క్రాంతి, ఇరిగేషన్ వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్ అధికారులు, సిబ్బంది, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, తీర్థాల గ్రామ మాజీ ఎంపీటీసీ కళ్లెం వెంకటరెడ్డి, దేవాలయం మాజీ చైర్మన్ వెంకన్న పాల్గొన్నారు.
Khammam Rural : వరదల సమయంలో అప్రమత్తతపై అవగాహన : తాసీల్దార్ రాంప్రసాద్