రామవరం, ఆగస్టు 19 : సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోవడానికి వర్క్‌షాప్ కార్మికుల కృషి ఎంతో కీలకం అని ఏరియా ఇంజినీర్ సత్యనారాయణ రాజు అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని వీకే వర్క్‌షాప్‌లో మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్ఓ టు జీఎం కోటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బొగ్గు వినియోగం పెరిగినందు వల్ల నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తిని చేసి వినియోగదారులకు అందివ్వాలన్నారు.
సమావేశంలో పాల్గొన్న ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి మధు కృష్ణ మాట్లాడుతూ.. సింగరేణి ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంలో అంకితభావంతో పనిచేస్తున్న వర్క్‌షాప్ కార్మికులకు ఓసీలలో పనిచేసే వారికి మాదిరే లాభాల వాటా ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను లేవనెత్తారు.
తాగునీటి సమస్య : వర్క్‌షాప్ కార్మికులకు పరిశుభ్రమైన తాగునీరు అందడం లేదని, ఆర్.ఓ. ప్లాంట్ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రమాదకర ప్రయాణం : ఉత్పత్తి లక్ష్యాల కోసం సత్తుపల్లికి వెళ్లే కార్మికులను లారీ లోడ్ వెనుక ప్రమాదకరంగా తరలిస్తున్నారని, ప్రమాదాలు జరగకుండా వారికి పూల్ వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు.
కార్మికుల భద్రత : అనారోగ్యంతో, గుండె జబ్బులతో విధిలేని పరిస్థితుల్లో వర్క్ షాప్ లో ఉద్యోగాలు చేస్తూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులు అధిక బరువులు ఎత్తడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని, వారి భద్రత కోసం వర్క్‌షాప్‌లో ఫోర్క్ లిఫ్టర్ వాహనాలను వెంటనే సమకూర్చాలని కోరారు.
పోస్టుల భర్తీ : ఖాళీగా ఉన్న క్లర్క్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టెండాల్, సూపర్వైజర్, జనరల్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.
మౌలిక సదుపాయాలు : వర్క్‌షాప్‌లో నూతన క్యాంటీన్/క్యాంటీన్ హాల్‌ను నిర్మించాలని, బురదమయంగా మారిన రోడ్లను సరిచేసి, డ్రైనేజ్ కాల్వలను నిర్మించాలని, గార్డెన్ సిబ్బందిని నియమించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జీఎం పర్సనల్ మోహనరావు, వర్క్‌షాప్ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.