జూలూరుపాడు, సెప్టెంబర్ 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో జడ్పీ సీఈఓ నాగలక్ష్మి శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను, పారిశుధ్య నిర్వహణను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న వీవో భవన నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి, సరిగ్గా నెల రోజుల్లోగా భవనాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆమె విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. పాఠశాల ఆవరణలో మురుగునీరు నిల్వ ఉండకుండా తక్షణమే ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ఉపాధ్యాయులకు, సిబ్బందికి సూచించారు.
గ్రామంలో వీధుల వెంబడి పర్యటించిన జడ్పీ సీఈఓ, చెత్త సేకరణ తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రతి వార్డులోనూ నాలుగు రకాల చెత్త సేకరణ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సంబంధించిన రికార్డుల నమోదు తీరును పరిశీలించి, సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి తోట తులసీరామ్, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

నెల రోజుల్లోగా వీవో భవన నిర్మాణం పూర్తి చేయాలి : జడ్పీ సీఈఓ నాగలక్ష్మి