చుంచుపల్లి, జూలై 15 : పిఎసిఎస్ కొత్తగూడెం సంఘ పరిధిలోని చుంచుపల్లి మండల సంఘ కార్యాలయంలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన ఎరువులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. రైతుల సౌకర్యార్థం తీసుకొచ్చిన యూరియా బుకింగ్ యాప్‌ను సద్వినియోగం చేసుకుని ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని యూరియాను పొందాలని సూచించారు. చుంచుపల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఏర్పాటు చేసిన కొత్త ఎరువుల పంపిణీ కేంద్రాన్ని చుంచుపల్లి, కొత్తగూడెం మండలాల రైతులు విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.
సంఘ అధ్యక్షుడు మండే వీర హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్‌తో రైతులు నేరుగా ఆన్లైన్లో యూరియాను బుక్ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటికే సుజాతనగర్, ఏఎంసీ లక్ష్మీదేవిపల్లి ప్రాంతాల్లో ఎరువుల కేంద్రాలు ఉన్నప్పటికీ, చుంచుపల్లి, కొత్తగూడెం మండలాల రైతుల సౌకర్యార్థం చుంచుపల్లి హౌసింగ్ బోర్డులోని సొసైటీ కార్యాలయంలో కొత్తగా ఎరువుల పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు కూచిపూడి జగన్నాథరావు, సంఘ డైరెక్టర్ కంటెం సత్యనారాయణ, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, షాబీర్ పాషా, చుంచుపల్లి వ్యవసాయ అధికారి రాజేశ్వరి, కొత్తగూడెం వ్యవసాయ అధికారి కరుణామయి, ఏఈఓలు మమత, ప్రసాద్, చుంచుపల్లి సర్పంచ్ బి.వీరన్న, విద్యానగర్ కాలనీ సర్పంచ్ శాంతి శ్రీ ప్రసాద్, చుంచుపల్లి మాజీ ఎంపీటీసీ రాంబాబు, కొత్తగూడెం ఏఎంసీ మాజీ అధ్యక్షుడు రాంబాబు, రైతులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.