చండ్రుగొండ మార్చి 17: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నా ఈ ప్రాంతంలోని గిరిజన రైతులకు, పేదలకు ఒరిగిందేమీ లేదని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతయ్యగూడెం గ్రామంలోని జలగం వెంగళరావు ప్రాజెక్టును ఆయన సందర్శించారు. మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు విజ్ఞప్తి మేరకు వెంగళరావు ప్రాజెక్టు తెగిన అలుగు ప్రదేశాన్ని ఆయన పరిశీలించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలుగు తెగినా నిర్మాణం ఎందుకు చేపట్లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన రైతు సభలో ఆయన మాట్లాడారు.
సాగునీటి అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం చేతకానితనం వల్ల ఈ ప్రాంతంలో తెగిన చెరువులు, ప్రాజెక్టులను నిర్మించడం లేదని విమర్శించారు. గిరిజనులకు బుక్కెడు బువ్వ కడుపున పెట్టడానికి పాలకులు విఫలమైనారన్నారు. పోడు భూముల్లో బోర్లు వేయడానికి, కరెంట్ సరఫరా చేయడానికి అధికారులు గిరిజన రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారని విమర్శించారు. పోడు పట్టాలు ఇచ్చినా పాలకులు ఆ భూముల్లో బోర్లు వేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. గిరిజన హక్కుల్ని కాల రాస్తే ఎస్సీ ఎస్టీ కమిషన్ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు.
ఈ ప్రాంతంలో గిరిజనులకు అన్యాయం జరిగితే వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు అని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలం చెందిందని ఎన్నికల హామీలను ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు, జిల్లా కలెక్టర్ లోకేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, అన్ని శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు, ఈ ప్రాంత గిరిజన రైతులు, గిరిజన సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.