చండ్రుగొండ, డిసెంబర్ 29 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం తిప్పనపల్లి రేషన్ దుకాణాన్ని జిల్లా సివిల్ సప్లై అధికారులు సీజ్ చేసినట్లు సివిల్ సప్లై ఆర్ఐ వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. ఈ నెల 28న రేషన్ షాప్ తనిఖీలో భాగంగా సివిల్ సప్లై అధికారులు చండ్రుగొండ, తిప్పనపల్లి రేషన్ షాపులను తనిఖీ చేయగా రేషన్ డీలర్లు అందుబాటులో లేరు. తిప్పనపల్లి రేషన్ షాప్‌లో 21 క్వింటాళ్ల బియ్యం లెక్కల్లో తేడా వచ్చినట్లు ఆర్ఐ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. దీంతో ఈ షాప్ ను సీజ్ చేసి పక్క రేషన్ షాప్ డీలర్ బాలాజీకి అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు.
అదేవిధంగా చండ్రుగొండ రేషన్ షాప్‌ను సీజ్ చేసి డీలర్ వచ్చేవరకు నిర్ణయాన్ని వాయిదా వేయడం జరిగిందన్నారు. రెండు రేషన్ షాపుల డీలర్ ఒకరే కావడం గమనార్హం. తిప్పనపల్లి రేషన్ షాప్ డీలర్, చండ్రుగొండ రేషన్ షాప్ డీలర్ ధరావత్ రామారావు. ఇతను అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తిప్పనపల్లి పంచాయతీ సర్పంచ్‌గా ఇటీవల ఎన్నికయ్యాడు. దీంతో అధికారులు ఇతడిపై చర్యలు తీసుకునేందుకు జంకుతున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి.