జూలూరుపాడు, మార్చి 17 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధక్షుడు యాస రోశయ్య ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండల కేంద్రంలో సోమవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ, రెవెన్యూ, ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నా రైతులకి ప్రయోజనం జరగడం లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అందరూ ఖండించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అయన డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సూచన మేరకు అన్ని రకాల పంటలకు ఖర్చుకు అదనంగా 50 శాతం మద్దతు ధర నిర్ణయించాలన్నారు.
ఈ నెల 19న జగన్నాథపురంలో జరిగే రైతు సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశానికి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం శాసనసభ్యులు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భాగం హేమంతరావు, పశ్యపద్మ, సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చండ్ర నరేంద్ర కుమార్, ముత్యాల విశ్వనాథం హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, ఎల్లంకి మధు, చెరుకుమల్ల రాజేశ్వరరావు, వెంకటి పాల్గొన్నారు.