ఇల్లెందు, జులై 02 : బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని ఇల్లెందు సబ్ డివిజన్ ఆపరేషన్ ముస్కాన్ ఇన్చార్జి, ఎస్ఐ సూర్య అన్నారు. బుధవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నేటి నుండి ఈ నెల 30 వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీధి బాలలు, బాల కార్మికులను గుర్తించి పని నుండి వారికి విముక్తి కల్పించనున్నట్లు చెప్పారు.
అటువంటి వారిని గుర్తించి సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో, గురుకుల పాఠశాలలో చేర్పించే అవకాశం ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా బాల బాలికలను పనుల్లో పెట్టుకుని వెట్టిచాకిరి చేయిస్తే కేసులు నమోదు చేసి, జరినామా విధిస్తామని తెలిపారు. ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ టీంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, లేబర్ అధికారులు ఉంటారన్నారు.