చుంచుపల్లి, మే 18 : చుంచుపల్లి మండలంలోని రుద్రంపూర్ గ్రామ పంచాయతీ పరిధికి చెందిన ఎస్ఆర్టీ ఏరియా ప్రజలు సోమవారం ప్రజావాణిలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సుమారు 50 మంది బాధితులు జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చినప్పటికీ, కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో హౌసింగ్ పీడీకి వినతిపత్రం, వ్యక్తిగత దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఆర్టీ ఏరియా పరిరక్షణ బాధ్యులు గూడెల్లి యాకయ్య మాట్లాడుతూ.. రుద్రంపూర్‌లోని ఎస్ఆర్టి ఏరియాను తొలగించి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటివరకు అర్హులైన తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇళ్లులేక ప్రజలు చెట్టుకొకరు, పుట్టకొక్కరుగా చెల్లాచెదురై నివసిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత కూడా లేక కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ఎంపికను జూన్ రెండో తేదీ నుంచి చేపట్టనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తమ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాముచందర్, జయరాజు, ఉష, రాజు, ప్రసాద్, కృపాల్, హరీష్, ఆఫ్సార్, సారయ్య, హసులాం, వెంకటరత్నం, రేణుక పాల్గొన్నారు.