– దుమ్ముగూడెం, బూర్గంపహాడ్ మండలాల్లో ఏఏఐ సాంకేతిక బృందం పర్యటన
– భూముల పరిశీలన
దుమ్ముగూడెం, సెప్టెంబర్ 08 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు అనువైన స్థలాల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు చెందిన బహుళ విభాగాల సాంకేతిక బృందం మంగళవారం దుమ్ముగూడెం మండలంలో పర్యటించింది. జిల్లాలో ఇప్పటికే ఆరు ప్రాంతాలను విమానాశ్రయ నిర్మాణానికి పరిశీలనలోకి తీసుకోగా, అందులో భాగంగా అర్లగూడెం, పెద్ద కమలాపురం, కమలాపురం, ఎర్రబోరు, కొత్తూరు తదితర ప్రాంతాల్లోని భూములను అధికారులు పరిశీలించారు. విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక అంశాలను బృంద సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా పరిశీలించిన ప్రాంతాల్లో భూమి పూర్తిగా సమతలంగా ఉండటం, పెద్దగా గుట్టలు లేకపోవడం, హైటెన్షన్ విద్యుత్ వైర్లు లేకపోవడం వంటి అంశాలను అధికారులు పరిశీలించారు. అలాగే ఈ ప్రాంతం వరద ప్రభావిత ప్రాంతం కాదని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ప్రాంత భౌగోళిక ప్రాధాన్యతను కూడా బృందం పరిశీలించింది. తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు సమీపంలో ఉండటం వల్ల రవాణా పరంగా ఈ ప్రాంతానికి ఉన్న అనుకూలతలను పరిశీలించారు. సుమారు 15 కిలోమీటర్ల పరిధిలోనే ఇతర రాష్ట్రాల సరిహద్దులు ఉండడం విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూల అంశంగా అధికారులు పరిశీలించినట్లు తెలిసింది.
ఇక విమానాశ్రయ నిర్మాణానికి భూమి అనుకూలతలో కీలకమైన మట్టి (సాయిల్ ) నాణ్యతను కూడా సంబంధిత అధికారులు పరిశీలించారు. భూమికి సంబంధించిన సాయిల్ పరిస్థితి బాగుందని సంబంధిత శాఖల అధికారులు సాంకేతిక బృందానికి వివరించినట్లు సమాచారం. ఏఏఐ బృందం భూమి స్వరూపం, సాయిల్ పరిస్థితి, వరద ముప్పు, విద్యుత్ లైన్లు, భౌగోళిక పరిస్థితులు, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించి నోట్ చేసుకుంది. పూర్తి స్థాయి సాంకేతిక పరిశీలన అనంతరం తదుపరి వివరాలను వెల్లడిస్తామని బృంద సభ్యులు తెలిపినట్లు సమాచారం. ఈ పరిశీలనకు కొత్తగూడెం ఆర్డీవో మధు నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో ఏఏఐ బృందానికి సహకరించారు. విద్యుత్ శాఖ ఏఈ మోహన్‌రెడ్డి, గనుల శాఖ అధికారులు, ఇరిగేషన్ ఏఈ సూర్యం, దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య, తహసీల్దార్ అశోక్‌కుమార్, సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులు, జియాలజిస్టులు తదితరులు క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి స్థల పరిశీలన
బూర్గంపహాడ్ : గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం బూర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీ పరిధిలోని పుష్కరవనం సమీపంలో భూములను ఎయిర్‌పోర్టు అథారిటీ బృందం మంగళవారం పరిశీలించింది. కొత్తగూడెం ఆర్డీవో మధు పర్యవేక్షణలో ఫారెస్టు, రెవెన్యూ, ట్రాన్స్‌కో సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఏఏఐ బృందం సభ్యులు భూముల పరిశీలన చేశారు. విమానాశ్రయం ఏర్పాటుకు వరద ప్రభావం లేని భూములున్న ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయా… లేవా అనేదానిపై చర్చించి ఈ భూములను పరిశీలించినట్లు బృందం తెలిపింది. ఈ కార్యక్రమంలో అటవీశాఖ నుండి టాస్క్ ఫోర్స్ ఎస్ఆర్ఓ శ్రీనివాస్, రెవెన్యూశాఖ నుండి తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, ట్రాన్స్‌కో నుండి ఏడీ నర్సింహారావు, ఏఈ గుర్రం ఉపేందర్, ఆర్అండ్బీ శాఖ అధికారులు, సర్వేయర్ పాల్గొన్నారు.