కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 26 : ప్రజలకు రహదారి భద్రత, చైతన్యం కల్పించడంలో భద్రాచలం రవాణా శాఖ యూనిట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, అసోసియేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీజీఓస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సంగం వెంకట పుల్లయ్య సేవలు అమూల్యం అని లయన్స్ క్లబ్ ఆఫ్ మిలీనియం క్లబ్ ప్రెసిడెంట్ లయన్స్ బొక్క శ్రీనివాస్ అన్నారు. ఉత్తమ రవాణా శాఖ అధికారిగా ప్రభుత్వం నుండి ఇటీవల అవార్డు పొందిన వెంకట పుల్లయ్యను క్లబ్ సభ్యులు మంగళవారం కొత్తగూడెంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తన వృత్తి ద్వారా వెంకట పుల్లయ్య సమాజానికి రోడ్డు భద్రత – ప్రమాదాల నివారణ కోసం వినూత్న పద్ధతుల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తూ, ప్రజల్లో రహదారి భద్రతపై చైతన్యం కల్పించడంలో విశిష్టమైన సేవలు అందించారని కొనియాడారు. రోడ్డు భద్రత అవగాహనతో పాటు ఆయా సందర్భాల్లో హెల్మెట్స్ పంపిణి చేయడం అభినందనీయమన్నారు.
అలాగే ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు, పెండ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో, అలాగే లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సందర్భాల్లో కనీసం ఒక మొక్కను నాటి, ప్రేమతో పెంచాలని పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం ద్వారా అవసరార్థుల ప్రాణాలను కాపాడాలని, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను గోల్డెన్ అవర్ లో ఆస్పత్రికి చేర్చేలా చర్యలు తీసుకుని పౌర బాధ్యతను గుర్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ లయన్ ఎన్.నరేశ్, ట్రెజరర్ లయన్ పి.నాగేశ్వరావుగారు, పీ డీ జి.లయన్ సీహెచ్ శివప్రసాద్, పోగ్రామ్ చైర్ పర్సన్ లయన్ పి.సత్యనారాయణ, ఆర్ సి లయన్ ఎస్. సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ లయన్ ఆర్.శాంతయ్య, పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ సక్రు, సీనియర్ లయన్స్ జి.రాజయ్య, లయన్ ఎన్.శ్రీనివాస్, లయన్ బాలు పాల్గొన్నారు.