రామవరం, మే 29 : లంబాడాలకు నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యత కల్పించాలని ఏజెన్సీ పరిరక్షణ కమిటీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య రవి నాయక్ అన్నారు. చుంచుపల్లి మండలం ఏజెన్సీ పరిరక్షణ కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం రుద్రంపూర్ తండాలో మాలోత్ గీత కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రవి నాయక్ మాట్లాడుతూ..గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కేవలం ఒక సీటు ఇచ్చి లంబాడాలకు ప్రాధాన్యత తగ్గించారన్నారు.
అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి విజయానికి ఏజెన్సీ పర్యవేక్షణ కమిటీ తరఫున కృషి చేశామన్నారు. రాష్ట్ర నామినెట్ పదవుల్లో కూడ గిరిజన లంబాడాలకు సముచిత స్థానం కల్పించలేదని, ఉమ్మడి జిల్లా నుండి ఒక్క పదవి కూడ లంబాడాలకు ఇవ్వలేదని విమర్శించారు. త్వరలో ప్రకటించనున్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవిని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు లాల్ సింగ్ నాయక్‌కు ఇవ్వాలన్నారు. లాల్ సింగ్ నాయక్ కు ఇవ్వడం ద్వారా గిరిజన లంబాడాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చినట్టు ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోత్ రాందాస్ నాయక్, ఏజెన్సీ పరిరక్షణ కమిటీ నాయకులు బోడ లక్ పతి, బానోత్ చందర్, బానోత్ హరి, బోడ రామ చందర్, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు.