కొత్తగూడెం అర్బన్, జూన్ 13 : ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సకల జనులు నిస్వార్థంగా, త్యాగ నిరతితో దశాబ్దాల పాటు చేసిన పోరాటాల ఫలితంగా, బలిదానాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాగిన తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. దాదాపు 1,300 మంది బలిదానాలకు పాల్పడ్డారన్నారు.
ఇంత ఘన చరిత్ర ఉన్న ఉద్యమకారులు ఆర్థికంగా, గుర్తింపు లేక మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, సంక్షేమ పథకాల్లో ఉద్యమకారులకు వాటా కల్పించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఎస్కే నబి సాహెబ్, బరగడ దేవదానం, కుడిక్యాల ఆంజనేయులు, హుస్సేన్, బుడగం నాగేశ్వర్ రావు, మూల నాగిరెడ్డి ఉన్నారు.