రుద్రంపూర్, ఆగస్టు 25 : “మొక్కని నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అనే సందేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం–2026లో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్లోని రామచంద్ర పార్క్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మూడ్ గణేష్, కమిషనర్ సుజాత మొక్కలు నాటి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెద్దవిగా పెంచినప్పుడే వన మహోత్సవం లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రతి ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
“నేడు మనం నాటే ప్రతి మొక్క.. రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. పచ్చని నగరాన్ని నిర్మించేందుకు ప్రజలంతా బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలి” అని మేయర్, కమిషనర్ సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొని మొక్కలు నాటారు. 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ కూడా మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.