కొత్తగూడెం అర్బన్, జూన్ 16 : ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను అణచి వేసేలా ప్రారంభించిన యుద్ధంను నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వర్రావు అన్నారు. సోమవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శాంతి చర్చలు ప్రారంభించాలని కోరుతూ ఈ నెల 27న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని గోడ పత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. గత 17 నెలల్లో దాదాపు 540 మంది మావోయిస్టులను చంపినట్లు తెలిపారు. విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ లకు కట్టబెట్టే క్రమంలోనే ఆ ప్రాంత ఆదివాసులను అక్కడి నుండి తరిమి వేయడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజల కోసం పనిచేస్తున్న మావోయిస్టు నాయకులను, ఆదివాసులను హతమారుస్తున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మారణ హోమాన్ని ఆపి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని, ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. శాంతి చర్చల కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 27న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంజీవ్,అశోక్, శ్రీను, సురేశ్, కృష్ణ పాల్గొన్నారు.