రామవరం, మే 08 : ఆ దారిలో పొరపాటున మీరు ఆదమరిస్తే ఇక అంతే సంగతులు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని సివిల్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్‌లోని బ్యారెక్స్ ప్రాంతంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ముందు గతంలో కల్వర్టు నిర్మించారు. కల్వర్టు పైన ఉన్న సిమెంట్ దిమ్మెలు కుంగడంతో కాలనీవాసులు అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు వచ్చి కృంగిన దిమ్మలను తీసి పక్కకు పెట్టి పని అయిపోయినట్టు వెళ్లిపోయారు.
దీంతో రాత్రిపూట ఎవరైనా ఆ కల్వర్టు మీదుగా ఆదమరిచి వెళ్తే గోతిలో పడి ప్రమాద బారిన పడే అవకాశం ఉంది. ప్రమాదపరితమైన ఇలాంటి పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే అందులో జనాలు పడి క్షతగాత్రులైతే బాధ్యులు ఎవరని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్వర్టుపైన సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.