రామవరం, అక్టోబర్ 27 : సింగరేణిలో తరచుగా వినబడే మాట పారదర్శకతకు పెద్దపీట వేస్తాం అని. అనేక సందర్భాల్లో అనేకచోట్ల సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నుండి జీఎం వరకు చెప్పే మాట. కానీ ఆచరణలో మాత్రం అది కనబడడం లేదు. యూనియన్ నాయకుల ఒత్తిడా? లేక ప్రజా ప్రతినిధుల పవర్ ముందు అధికారులు తాము చెప్పిన మాటను తామే పాటించలేకుండా ఉండిపోయారా అని తెలియని స్థితిలో సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని కార్మికులు ఉన్నారు. గత నెల సెప్టెంబర్ 15న కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి గని అండర్ గ్రౌండ్ పనిచేస్తున్న ఫిట్టర్(10), ఎలక్ట్రిషన్ (16) మందిని జేవిఆర్ఓసి 2, కిష్టారం ఓసి, జివిఆర్ సిహెచ్పీలో సర్ఫేస్ లో (ఉపరితల గనిలో) పని చేయుటకు దరఖాస్తులు చేసుకోమని సర్కులర్ జారీ చేశారు. చాలామంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నెల 14వ తేదీన వీరికి కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ నిర్వహించే సందర్భంగా అధికారులు తప్పకుండా సత్తుపల్లిలో పని చేయడానికి విముఖత ఉంటే కౌన్సిలింగ్లో పాల్గొనండి లేకపోతే నాట్ విల్లింగ్ (ఇష్టం లేదని) అని రాసి ఇవ్వండని చెప్పిన అధికారులు మాత్రం కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత పోస్టింగ్ ఇచ్చే సమయంలో ఫిట్టర్ (3), ఎలక్ట్రిషన్ (5) మందికి స్థానికంగా పోస్టింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ నిర్వహించే రోజు తప్పకుండా సత్తుపల్లిలో పని చేయాలని చెప్పి వీరికి మాత్రం స్థానికంగా పోస్ట్ ఇవ్వడం అది కూడా సీనియారిటీని కాదని పైరవీలు చేసుకున్న వారికి పెద్దపీట వేశారు. పలుకుబడి లేకపోతే సింగరేణిలో న్యాయం జరగడం లేదని, గతంలో ఈ విధానం లేదని ఇప్పుడు ఈ కొత్త పోకడ ఏంటని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాము గత పది సంవత్సరాలుగా భూగర్భ గనిలో దిగి కష్ట పడ్డామని, కష్టమని భావించకుండా సింగరేణి సంస్థ అభివృద్ధిలో భాగం కావాలనుకున్నాం. పైరవీల జోలికి పోలేదు. పైన పని చేయాలని అనుకోలేదు. అవకాశం యాజమాన్యం కల్పించింది. కానీ ఇందులో ఏ ఒక్కరోజు భూగర్భ గనిలో దిగకుండా, డిప్యూటేషన్ పై పైన పనిచేసిన వారికి మళ్లీ స్థానికంగా పోస్టులు ఇస్తారా? అన్యాయంపై మాట్లాడాల్సిన కార్మిక పక్షం వహించాల్సిన యూనియన్లు కొందరు వారికి నచ్చిన వారికి పైరవీలు, రాజకీయ పలుకుబడికి లోబడి పని చేయడం కాకుండా పోస్టులు కేటాయించడంలో కూడా తమకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి న్యాయ విచారణ జరిపి సంస్థ అభివృద్ధి కోసం కష్ట పడుతున్న కార్మికులకు న్యాయం చేయాలని బాధిత కార్మికులు కోరుతున్నారు. ఈ విషయమై నమస్తే తెలంగాణ కొత్తగూడెం ఏరియా పర్సనల్ డీజీఎం వెంకట మోహన్ రావును వివరణ కోరగా సీనియారిటీ అండర్ గ్రౌండ్ నుండి సర్ఫేస్ కు కన్వర్షన్ చేశామని. స్థానిక పోస్టింగ్ విషయంలో మేనేజ్మెంట్ పాలసీ ఉంటుందని ఇప్పటికే అక్కడ డిప్యూటేషన్ పై పని చేస్తున్న వారిని ప్రాథమికంగా ఇచ్చామని చెప్పడం విశేషం.