పాల్వంచ, ఆగస్టు 14 : సమాజానికి సేవ చేయడమే కాకుండా, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అలాగే ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు నేతాజీ యువజన సంఘం కృషి చేస్తోందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్జే. కె. అహ్మద్ తెలిపారు. నేతాజీ యువజన సంఘం 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం పాల్వంచ పట్టణ పరిధి వనమా కాలనీలోని ఆ సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్, యూత్ కాంగ్రెస్ పాల్వంచ పట్టణ ఉపాధ్యక్షుడు భార్గవ్ సాయి, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎం.డి.మంజూరు, తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు అహ్మద్ చేస్తున్న సేవలను కొనియాడుతూ ఆయనను ఘనంగా సన్మానించారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఈ సందర్భంగా వారు ఆకాక్షించారు.
అహ్మద్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు అండగా ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం యువకులకు క్రీడా స్ఫూర్తి, దేశభక్తి పెంపొందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం జరిగిన దేశభక్తి గీతాలాపన కార్యక్రమంలో సినీ జానపద గాయకుడు పెద్దిపాక విజయ్, న్యూ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ ఖాసిం, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ బాషా తమ పాటలతో అందరిని అలరించి ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అక్బర్, అబ్దుల్ రజాక్, అబ్దుల్ రావూఫ్, ఎం. సంతోశ్, పి.రమేశ్, ఉబ్బెన శ్రీను, ఓలపల్లి రాంబాబు, సక్కుబాయి, విజయ, ప్రవళిక, హరి సాయిరాం, చిమ్మి నాయుడు, బవ్ సింగ్, ఎం.డి.ఆసిఫ్ పాల్గొన్నారు.