కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 24 : సింగరేణిలో శ్రమ దోపిడికి, కార్పోరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా నిజాయితీగా పోరాటం చేసిన నాయకుడు ముక్తార్ పాషా అని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎన్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.సీతారామయ్య, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ అన్నారు. బుధవారం రైటర్బస్తీలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన ఐఎన్టీయూ రాష్ట్ర నాయకుడు ముక్తార్ పాషా 5వ వర్ధంతి కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. శ్రమ దోపిడికీ వ్యతిరేకంగా 40 ఏండ్ల పాటు ఎన్నో పోరాటాలు చేశారని, సింగరేణిలో పని చేస్తున్న 35 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం, కనీస వేతనాల కోసం మిలిటెంట్ ఉద్యమాలు, నిరవధిక సమ్మెలు నిర్వహించి విజయం సాధించాడని, ఆయన జీవితం కార్మిక లోకానికి ఆదర్శమన్నారు.
మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక చట్టాలు కేవలం కార్పోరేట్ శక్తుల కోసమేనని, ఆ చట్టాల వల్ల కార్మికులు హక్కులు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. బొగ్గు గనులతో పాటు ఖనిజ సంపదలను, వనరులను అంబానీ, అదానీలకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్న ప్రధాని మోదీకి బుద్ది చెపాల్సిన అవసరం ఉందన్నారు. 70 కోట్ల మంది కార్మికులు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లపై 22 సార్లు సమ్మెలు నిర్వహించినా మోదీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఇలాంటి సంధర్భంలో ఐక్య ఉద్యమాలు చేసి కార్మికుల హక్కులను, చట్టాలను రక్షించుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్క కార్మికుడిపై ఉందన్నారు.
ఇలాంటి సమయంలో ముక్తార్ పాషా లాంటి నాయకుడు ఉంటే ఉద్యమాలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉండేదని, అయినప్పటికీ ఆయన ఆశయ సాధన కోసం అందరం ఏకమై చట్టాల రద్దుకు, ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు, న్యాయవాది సింగు ఉపేందర్, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.సంజీవ్, నాయకులు గౌని నాగేశ్వరరావు, ఐఎన్టీయూ రాష్ట్ర, జిల్లా నాయకులు మోతూకూరి మల్లికార్జున్, ఎండీ.అలీముద్దీన్, ఎల్.మారుతీరావు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రాజేశ్వరి, శారద, ఫిరోజ్, మురళీ పాల్గొన్నారు.