భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 8 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా ఒక్కటేనని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మండి పడ్డారు. ఆదివారం కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారలో అయన మాట్లాడారు. రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలను ఎదగకుండా తొక్కేయాలని చూస్తుంటాయని అన్నారు. కొత్తగూడెం 28వ డివిజన్ గొల్లగూడెం రైటర్స్ బస్తీలో పార్టీ అభ్యర్థి మీసాల రాజేష్ గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన స్థానికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీసీల పట్ల కాంగ్రెస్, బీజేపీల వైఖరిని నిలదీశారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీనిచ్చి కాంగ్రెస్ నాయకులు మోసగించారని ఆవేదన చెందారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని వాగ్దానం చేసిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఈ రెండు జాతీయ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తెలంగాణ గొప్పగా అభివృద్ధి చేసిన కేసీఆర్ నాయకత్వాన్ని మరింత శక్తివంతం చేద్దామన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి, కాపు కృష్ణ,లక్కినేని సురేందర్,హరిసింగ్ నాయక్, రాజేష్ (కన్ని) తదితరులు పాల్గొన్నారు.