Ranveer Singh | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రస్తుతం తన కెరీర్లో గోల్డెన్ ఫేజ్‌ను ఆస్వాదిస్తున్నాడు. ఆయన నటించిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని సంచలనాలు సృష్టిస్తోంది. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాలో రణవీర్ సింగ్ కనబరిచిన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా విశేష ప్రశంసలు దక్కుతున్నాయి.ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ధురంధర్ 2 ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారతీయ సినిమా చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో రణవీర్ పెర్ఫార్మెన్స్కు ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఆయనకే దక్కే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ భారీ విజయంతో రణవీర్ తదుపరి ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇదే సమయంలో ఆయన కెరీర్‌కు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో అంగీకరించిన డాన్ 3 ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కారణాలు అధికారికంగా వెల్లడికాలేదు కానీ, ఇతర భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా రణవీర్ సింగ్ ‘ప్రళయ్’ అనే భారీ బడ్జెట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది జాంబీ నేపథ్యంతో తెరకెక్కనున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇప్పటివరకు భారతీయ సినిమాల్లో ఎక్కువగా చూడని కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందనుంది.
‘ప్రళయ్’ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేందుకు మేకర్స్ భారీ ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో, విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఈ సినిమాను రూపొందించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ రణవీర్ సింగ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలవనుందని అంటున్నారు. రణవీర్ సింగ్ ‘ధురంధర్’ విజయంతో టాప్ ఫామ్‌లో ఉండగా, ‘ప్రళయ్’తో మరోసారి భారీ సంచలనానికి సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.