TN 2026 Teaser | కోలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఒక టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. దళపతి విజయ్ ‘జననాయగన్’ సినిమా విడుదల అనుకోని కారణాలు, రాజకీయ ఒత్తిడుల వల్ల ఆగిపోయినప్పటికీ, ఇప్పుడు రాబోతున్న ‘TN 2026’ చిత్రం మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు రావడానికి పక్కాగా సిద్ధమైంది. ఈ సినిమా దళపతి విజయ్ రాజకీయ ప్రయాణానికి ఎంతగానో మేలు చేస్తుందని, దానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో చర్చ మొదలైంది. తమిళనాడు రాజకీయాలు, సినిమా స్టార్ల చుట్టూ తిరిగే పక్కా పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నట్టి నటరాజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన ఒక సినిమా సూపర్ స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారే పవర్ఫుల్ పాత్రలో దుమ్మురేపనున్నారు.
ఈ కథను ప్రముఖ నటుడు తంబి రామయ్య అందించగా, ఆయన కుమారుడు ఉమాపతి రామయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి దర్బుక శివ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తుండగా, కణ్ణన్ రవి గ్రూప్స్ పతాకంపై కణ్ణన్ రవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా.. ఒక ప్రముఖ సినిమా నటుడు తన అభిమాన సంఘాలను రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికల బరిలోకి దిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కోణంలో ఈ సినిమా కథ ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఒక నటుడు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడు? అంటూ ఇప్పటికే ఉన్న రాజకీయ నాయకులు అతడిని ప్రశ్నించడం, వారిని ఢీకొంటూ హీరో భారీ ప్రజాదరణ సంపాదించడం వంటి పవర్ఫుల్ సన్నివేశాలతో ఈ టీజర్ ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. ప్రస్తుత తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలను ఈ సినిమాలో చాలా సెటైరిక్‌గా చూపించబోతున్నట్లు స్పష్టమైన హింట్లు ఇచ్చారు. ఎం.ఎస్. భాస్కర్, ఇళవరసు, రెడిన్ కింగ్స్లీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ ‘TN 2026’ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావడానికి ముస్తాబవుతోంది.